Covid Relief: విశ్వనాథ్‌ ఆనంద్‌తో చాహల్‌ చెస్‌ పోటీ

టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ ఆదివారం భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌తో చెస్‌ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని యూజీ సతీమణి ధనశ్రీ వర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు...

Updated : 20 Sep 2022 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్‌ బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ ఆదివారం భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌తో చెస్‌ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని యూజీ సతీమణి ధనశ్రీ వర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. కొవిడ్‌-19 రిలీఫ్‌ వర్క్‌ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఆనంద్‌ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్‌ పోటీల్లో తలపడనున్నాడు. ఈ నేపథ్యంలోనే చాహల్‌తోనూ ఒక ఆటలో తలపడనున్నాడు. ఈ పోటీల్లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, ఆమిర్‌ ఖాన్‌, అర్జిత్‌ సింగ్‌, అనన్య బిర్లాతో పాటు మనుకుమార్‌ జైన్‌ సైతం పోటీపడనున్నారు.

ఇదే విషయాన్ని ఆనంద్‌ సైతం తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఓ వీడియోలో మాట్లాడుతూ ఆయా ప్రముఖులతో పోటీపడుతున్నట్లు వెల్లడించాడు. వారితో చెస్‌ గేమ్స్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానన్నాడు. మరోవైపు చాహల్‌ ఇదివరకే క్రికెట్‌లోకి రాకముందు జాతీయ స్థాయిలో చెస్‌ క్రీడాకారుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ తలపడ్డాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తిగా మారే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి క్రికెట్‌లో స్పిన్‌ బౌలింగ్‌తో అదరగొట్టే యూజీ చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని