IND vs SA : రహానెకు నేనిచ్చే సలహా అదే: జహీర్‌ ఖాన్‌

ఫామ్‌ అందిపుచ్చుకునేందుకు అజింక్య రహానెకు ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ సరిపోతుందని...

Published : 26 Dec 2021 01:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఫామ్‌ అందిపుచ్చుకునేందుకు అజింక్య రహానెకు ఒకే ఒక్క ఇన్నింగ్స్‌ సరిపోతుందని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. అయితే రహానెపై తీవ్ర ఒత్తిడి ఉందని, దానిని అధిగమించేందుకు దక్షిణాఫ్రికా పర్యటన మంచి వేదికని తెలిపాడు. ‘‘రహానె ఎంతో ఒత్తిడితో ఉన్నాడనే కాదనలేని సత్యం. అందుకే మానసికంగా దృఢంగా ఉండాలి. ఫామ్‌లోకి రావాలంటే ఒక్క ఇన్నింగ్స్‌ చాలనే నమ్మకం పెంచుకోవాలి. ఎలాంటి క్రికెటర్‌కైనా ఆత్మవిశ్వాసం ముఖ్యం. అజింక్య రహానె విదేశాల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. అదే అతడికి సానుకూలాంశం’’ అని వివరించాడు. 

ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ప్రారంభం కానుంది. తనకున్న క్రికెట్‌ అనుభవంతో రహానెకు జహీర్‌ ఖాన్‌ కీలక సూచనలు చేశాడు. ‘‘నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నా. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటే అనుకోవాలి. ‘ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడితే చాలు గాడిలో పడిపోతాం’ అని ఎప్పటికప్పుడు అనుకుంటూ గుర్తుకు పెట్టుకోవాలి. ఒక్కసారి దానిని అందుకుంటే చాలు పరిస్థితులు వేగంగా మారిపోతాయి. క్రికెటర్‌గా సవాళ్లను స్వీకరించి దీటుగా ఎదుర్కోవాలి. ఇదే రహానెకు నేనిచ్చే సలహా’’ అని జహీర్‌ అన్నాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌ వరకు టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా రహానె ఉండేవాడు. బ్యాటర్‌గా విఫలం కావడంతో రహానెను ఉపసారథ్యం పోయింది. దక్షిణాఫ్రికా పర్యటనకు విరాట్‌కి రోహిత్‌ను డిప్యూటీగా బీసీసీఐ నియమించింది. అయితే రోహిత్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కాగా.. కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో బ్యాటర్‌గానూ రహానె విఫలమైతే జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని