
T20 World Cup: కివీస్‌పై పాండ్య బౌలింగ్ చేస్తాడనుకుంటున్నా: జహీర్
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడెక్కడ చూసినా హార్దిక్ పాండ్య పేరే మార్మోగిపోతోంది. మీడియం పేస్ బౌలింగ్‌తో, మిడిలార్డర్ బ్యాటర్‌గా భారత క్రికెట్ జట్టులో టాప్ ఆల్‌రౌండర్‌గా మారిన పాండ్య.. గత రెండేళ్లుగా బంతినే విసరడం లేదు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ (పాకిస్థాన్‌పై)లో బౌలింగ్ వేయకపోగా.. బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించిందీ లేదు. వెన్నెముకకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఫామ్ సాధించేందుకు తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య నెట్స్‌లో బౌలింగ్ సాధన చేశాడనే వార్తలు వచ్చాయి. ఆదివారం టీమిండియా కీలకమైన కివీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా పాండ్య బౌలింగ్ చేయాలని పలువురు మాజీ ఆటగాళ్లు సహా అభిమానులు కోరుతున్నారు. మరోవైపు పాండ్య స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను కానీ.. ఇషాన్ కిషన్‌నుగానీ తీసుకోవాలనే వారూ లేకపోలేదు.
ఈ నేపథ్యంలో హార్దిక్ బౌలింగ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌బౌలర్, ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్‌ఖాన్ స్పందించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. హార్దిక్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే బౌలింగ్ విభాగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాడు. ‘‘ఏదో ఒక దశలో హార్దిక్ బౌలింగ్ చేయాల్సిందే. అయితే మ్యాచుల్లో అతడు ఎప్పుడు బౌలింగ్ చేస్తాడనేది వేచి చూడాలి. పాక్‌తో మ్యాచ్ అనంతరం పాండ్య నెట్స్‌లో బౌలింగ్ సాధన చేశాడు. అందుకే కివీస్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తాడని ఆశిస్తున్నా. పాండ్య బౌలింగ్ చేయడం టీమిండియాకు ఎంతో అవసరం. ఐదుగురు బౌలర్లతో ఆడుతున్న జట్లలో భారత్ ఒకటి. అందుకే ఆరో బౌలర్ ఆప్షన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేస్తున్నా. దీని వల్ల ప్రత్యర్థిపై బౌలింగ్ దాడికి పరిపూర్ణత లభిస్తుంది’’అని జహీర్ వివరించాడు. ఆదివారం జరిగే మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ రెండింటికీ చాలా కీలకం. ఇప్పటికే చెరో ఓటమితో ఉన్న ఇరు జట్లలో రేపు ఎవరు పైచేయి సాధిస్తే.. వారికే సెమీస్ అవకాశాలు అధికంగా ఉంటాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.