ఆనంద్‌తో ఆట.. నేను చేసిన పనికి క్షమాపణలు!

అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ పేరిట చెస్‌ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్‌ పోటీల్లో తలపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జెరోధా సంస్థ సహ యజమాని నిఖిల్‌ కామత్‌ సైతం పోటీపడి...

Updated : 14 Jun 2021 19:23 IST

జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్‌ కామత్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రిలీఫ్‌ ఫండ్‌ పేరిట చెస్‌ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆదివారం పలువురు ప్రముఖులతో చెస్‌ పోటీల్లో తలపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిరోధా సంస్థ సహ యజమాని నిఖిల్‌ కామత్‌ సైతం పోటీపడి ఆనంద్‌ను ఓడించారు. అయితే, అతడు మోసం చేసి గెలిచినట్లు వార్తలు రావడంతో ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌(ఏఐసీఎఫ్‌) కార్యదర్శి భరత్‌ చౌహన్‌ స్పందించారు. ఛారిటీ పోటీల్లో ఇలా మోసం చేసి గెలవడం దురదృష్టకరమని వాపోయారు.

ఈ క్రమంలోనే నిఖిల్‌ కామత్‌ సైతం ట్విటర్‌లో ఓ పోస్టు చేసి తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. ‘నేను చిన్నప్పుడు చెస్‌ నేర్చుకునే రోజుల్లో విశ్వనాథ్‌ ఆనంద్‌తో ఆడాలనుకున్నా. అది నిన్నటితో నిజమైంది. అక్షయపాత్ర సంస్థ వారు ఆనంద్‌తో కలిసి ఛారిటీ కోసం చెస్‌ పోటీలు నిర్వహించడంతో నాకా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే, నేను నిజంగానే విశ్వనాథ్‌ ఆనంద్‌ను చెస్‌లో ఓడించానని చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పు. అదెలా ఉందంటే నేను నిద్రలేచిన వెంటనే ఉసేన్‌బోల్ట్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీపడి గెలిచినట్లుగా ఉంది’ అని నిఖిల్‌ పోస్టు చేశారు.

‘ఆనంద్‌ సర్‌తో ఆడిన గేమ్‌లో నేను కొంత మంది వ్యక్తులు, కంప్యూటర్‌ నుంచి సహాయం పొందాను. ఈ పోటీలు కేవలం సంతోషం, ఫండ్‌ రైజింగ్‌ కోసమే నిర్వహించారు. అయితే, నేను చేసిన పనితో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని అస్సలు ఊహించలేదు. అందుకు క్షమాపణలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అనంతరం దీనిపై స్పందించిన చెస్‌ దిగ్గజం.. నిన్న పలు రంగాల ప్రముఖులతో ఆడటమనేది ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించడానికి. ఆటలోని నియమాలు పాటిస్తూ ఆడటం చాలా సంతోషంగా అనిపించింది. ఆటలో ఎదురైన పరిస్థితులను బట్టే నేను ఆడాను. ఇతరుల నుంచి కూడా అదే ఆశించాను’ అని విశ్వనాథన్‌ రీట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు