Sikandar Raza: సమస్యకు మరో సమస్య సృష్టించడమే పరిష్కారం కాదు: సికందర్ రజా

భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కొన్ని పొరపాట్లు చేశామని.. వాటిని వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా వ్యాఖ్యానించాడు.

Updated : 11 Jul 2024 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో (ZIM vs IND) జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో మ్యాచ్‌లో ఓటమి అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు అదనంగా 20 పరుగులను ఫీల్డింగ్‌ రూపంలో వదిలేసిందని తెలిపాడు. అదే తీవ్ర ప్రభావం చూపించిందని.. 23 పరుగుల తేడాతోనే తాము ఓడిపోయినట్లు పేర్కొన్నాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన కెప్టెన్ 2 వికెట్లు తీసి 24 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ 16 బంతుల్లో 15 పరుగులు చేశాడు.

‘‘మా టాప్‌ ఆర్డర్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫీల్డింగ్‌లోనూ ఇంకాస్త మెరుగవ్వాల్సింది. మా ఫీల్డర్ల విషయంలో ఇప్పటికీ గర్వంగానే ఉన్నా. కానీ, మూడో టీ20లో అనుకున్నంత మేర రాణించలేకపోయాం. అదనంగా 20 పరుగులు జారవిడిచాం. టాప్‌ ఆర్డర్‌ కూడా కుదురుకోవాలి. ఇవే మా ఓటమికి ప్రధాన కారణాలు. ఇప్పటివరకు మేం 15 రకాలుగా విభిన్న ఓపెనింగ్‌ భాగస్వామ్యాలను ప్రయత్నించాం. నాతో సహా సీనియర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. కుర్రాళ్లు తప్పిదాలు చేయడం సహజమే. అలాగని సీనియర్లు కూడా పొరపాట్లకు తావిస్తే ఆమోదయోగ్యం కాదు. సమస్యకు సమస్య సృష్టి పరిష్కారం కాదు. మాకు ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. అలాంటప్పుడు తప్పకుండా మరిన్ని పరుగులు చేయాలి’’ అని సికందర్‌ వ్యాఖ్యానించాడు. 

మేం శనివారమే ముగిస్తాం: సుందర్

ఇప్పటికే సిరీస్ ఆధిక్యంలో నిలిచిన భారత్ మరో మ్యాచ్‌ గెలిస్తే చాలు ఖాతాలో పడిపోతుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్న వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ..  ‘‘మూడో మ్యాచ్‌ మాకు అత్యంత కీలకం. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో రాణించాం. ఈ పిచ్‌ కాస్త క్లిష్టంగానే ఉంది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేస్తేనే ఫలితం ఉంటుంది. ఇక శనివారం జరగబోయే నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాం. జట్టు కోసం వందశాతం ఏం చేయగలనో అది చేసేందుకు ప్రయత్నిస్తా. ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్‌ విషయంలో ఇంకాస్త మెరుగు కావాల్సి ఉంది’’ అని సుందర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని