ZIM vs IND: ఒకే ఏడాది.. భారత్‌ రెండోసారి 10 వికెట్ల విజయం

జింబాబ్వేపై తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన...

Published : 18 Aug 2022 20:43 IST

జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

ఇంటర్నెట్ డెస్క్‌: జింబాబ్వేపై తొలి వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 190 పరుగులను 30.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా భారత్‌ ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌ (81*), శుభ్‌మన్‌ గిల్ (82*) అర్ధశతకాలతో రెచ్చిపోయారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును దీపక్‌ చాహర్‌ (3/27) అందుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం టీమ్ఇండియా సారథి కేఎల్‌ రాహుల్, జింబాబ్వే కెప్టెన్‌ రెగిస్‌ చకబ్వా, దీపక్‌ చాహర్‌ మాట్లాడారు. 

* కేఎల్ రాహుల్‌: ఆట నుంచి దూరంగా ఉండటం చాలా కష్టం. అయితే గాయాల వల్ల చాలా మ్యాచ్‌లను కోల్పోయా. ఇంకా చాలా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేను, దీపక్‌, కుల్‌దీప్‌ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో  శ్రమించాం. భారత డ్రెస్సింగ్‌రూమ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. ఇక మైదానం విషయానికొస్తే.. కాస్త స్వింగ్‌తోపాటు సీమ్‌ బాగుంది. మా బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించారు. వరుసగా జింబాబ్వే వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచారు. జట్టుగా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాం. 

* రెగిస్‌ చకబ్వా: టాప్‌ ఆర్డర్‌ను త్వరగా కోల్పోవడం తీవ్రంగా నష్టపరిచింది. భారత బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మామీద ఒత్తిడి తెచ్చారు.  చివర్లో రిచర్డ్స్‌ ఎన్‌గరవ -బ్రాడ్ ఇవాన్స్ మంచి భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఆరంభంలోనే మంచి పార్టనర్‌షిప్‌లు మాకు అవసరం. ఇవాళ  అది జరగలేదు. అయితే మా బౌలర్లు కష్టపడినా ఫలితం దక్కలేదు. బోర్డుమీద  భారీ లక్ష్యం లేకపోవడంతో టీమ్‌ఇండియా బ్యాటర్లు రిస్క్‌ చేయకుండా ఆడేశారు. దీంతో వికెట్లు తీయడం కష్టంగా మారింది. మ్యాచ్‌లోని లోటుపాట్లపై  సమీక్షించుకుంటాం. రెండో వన్డేలో తప్పకుండా పుంజుకుని గెలుస్తాం.

* దీపక్ చాహర్‌: దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆటగాడు పునరాగమనం చేయడం చాలా కష్టంతో కూడుకున్నదే. అంతేకాకుండా కాస్త ఆందోళనగా కూడా ఉంటుంది. అయితే నేను ఇక్కడకు రాకముందే నాలుగైదు ప్రాక్టీస్‌ గేమ్‌లను ఆడాను. ప్రారంభ ఓవర్లలో బాడీ, మైండ్ ఒకే దారిలోకి వచ్చేందుకు తటపటాయించాయి. కానీ వికెట్లు పడుతున్న కొద్దీ బాగుందనిపించింది. 

జింబాబ్వే X భారత్‌ తొలి వన్డే మ్యాచ్‌ విశేషాలు: 

* ఒకే జట్టుపై భారత్‌ అత్యధికంగా వరుస విజయాలు: జింబాబ్వేపై 13 మ్యాచ్‌లు (2013-22)

* 192/0: పది వికెట్ల విజయాల్లో అత్యధిక రెండో ఓపెనింగ్‌ భాగస్వామ్యం ఇదే. ఇంతకముందు జింబాబ్వే పైనే 197/0

* వన్డేల్లో 6500 పరుగులను పూర్తి చేసిన పదో టీమ్‌ఇండియా బ్యాటర్‌ శిఖర్ ధావన్ (6574)

* యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఏడు వన్డేల్లో మూడో హాఫ్‌ సెంచరీ నమోదు

* గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో తొలి వికెట్‌కు ధావన్-గిల్ మూడు సార్లు సెంచరీ భాగస్వామ్యాలు (119, 48, 113, 192*)

* ఒకే ఏడాదిలో భారత్‌ రెండుసార్లు పది వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. గత జులైలో ఇంగ్లాండ్‌పైనా సూపర్‌ ఫీట్‌ను టీమ్‌ఇండియా సాధించింది.

*  ఇప్పటి వరకు భారత్‌ ఎనిమిదిసార్లు పది వికెట్ల తేడాతో విజయాలను నమోదు చేసింది. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts