ZIM vs IND: తొలి టీ20లో జింబాబ్వే విజయం

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే (Harare) వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 06 Jul 2024 20:19 IST

హరారే: టీ20 ప్రపంచకప్‌ను సాధించిన టీమ్ ఇండియాకు (Team India) జింబాబ్వే (Zimbabwe) షాక్‌ ఇచ్చింది. విజయోత్సాహాల నుంచి బయటపడక ముందే పరాజయాన్ని రుచి చూపించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే (Harare) వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటయ్యింది. 

గిల్‌, సుందర్ పోరాడినా..

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే బ్రియాన్‌ బెన్నెట్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (31; 29 బంతుల్లో 5×4) తొలి డౌన్‌లో వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (7)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే.. ముజరబాని బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి ఇన్నోసెంట్‌ కైయాకు క్యాచ్‌ ఇచ్చి గైక్వాడ్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్ (2), రింకూ సింగ్‌ (0), ధ్రువ్‌ జురెల్‌ (7) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.  సగం ఓవర్ల వరకు క్రీజులో నిలదొక్కుకున్న గిల్‌ను సికిందర్‌ బౌల్డ్‌ చేశాడు. చివర్లో వచ్చిన రవి బిష్ణోయ్‌ (9), అవేశ్‌ ఖాన్‌ (16; 12 బంతుల్లో 3×4) వాషింగ్టన్‌ సుందర్‌ (27; 34 బంతుల్లో 1×4, 1×6)  పోరాడినా ఫలితం లేకపోయింది. చటార (3/16), సికిందర్ రజా (3/25) భారత్‌ను దెబ్బకొట్టారు. బెన్నెట్, మసకద్జా, జాంగ్వి, ముజరబాని తలో వికెట్ పడగొట్టారు. 

సమష్టిగా జింబాబ్వే..

అంతకుముందు జింబాబ్వే సమష్టిగా రాణించింది. ఓపెనర్‌ ఇన్నోసెంట్‌ కైయా (0) డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. వెస్లీ మద్వీర (21), బ్రియాన్‌ బెన్నెట్‌ (22), సికందర్‌ (17), డియోన్ మైయర్స్ (23), క్లైవ్ మదాండే (29*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. క్యాంప్‌బెల్‌ (0), వెల్లింగ్టన్‌ (0) జాంగ్వీ (1) నిరాశ పరిచినప్పటికీ.. మిగతా ఆటగాళ్లంతా రాణించడంతో జింబాబ్వే మోస్తరు స్కోరు సాధించింది. భారత్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్‌ సుందర్‌ 2,  అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ చెరో వికెట్‌ తీశారు. టార్గెట్‌ చిన్నదే అయినా.. గిల్‌ మినహా.. టీమ్‌ ఇండియా కీలక బ్యాట్స్‌మెన్లంతా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారమంతా లోయర్‌ ఆర్డర్‌పై పడింది. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు