సామాజిక, గ్రామసభ హక్కులు కల్పించరా?

అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుల క్రమబద్ధీకరణలో రక్షిత అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్‌) నిబంధనల ప్రకారం దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది.

Published : 28 Nov 2021 05:04 IST

అటవీ భూముల క్రమబద్ధీకరణపై పిటిషన్‌
దరఖాస్తులు స్వీకరించాలన్న హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కుల క్రమబద్ధీకరణలో రక్షిత అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్‌) నిబంధనల ప్రకారం దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయా గిరిజనుల నుంచి వ్యక్తిగత హక్కుల క్రమబద్ధీకరణకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించాలంటూ నవంబరు 2న ములుగు జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇటీవల జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారణ చేపట్టి.. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 7వ తేదీకి వాయిదా వేశారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన అటవీ హక్కుల కమిటీ ఛైర్‌పర్సన్‌ ఎం.సాయిబాబు, మరో నలుగురు హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘రక్షిత అటవీ హక్కుల చట్టం నిబంధనల ప్రకారం వ్యక్తిగత, సామాజిక, గ్రామసభకు చెందిన హక్కుల కల్పనకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. ఆయా గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు ఆ ప్రాంత పరిరక్షణ బాధ్యత ఆయా గ్రామ గిరిజనులకే కల్పించాలి. ఈమేరకు హక్కులు కల్పించాలని మేము 2008లో దరఖాస్తు చేశాం. వాటిని పరిష్కరించలేదు. ఇటీవల ప్రభుత్వం అటవీ హక్కుల క్రమబద్ధీకరణకు.. అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ అటవీ హక్కుల చట్టం-2006 సెక్షన్‌ 3, 4, 6లతోపాటు 11, 12, 12ఎ, 12 బి, 13 నిబంధనలకు విరుద్ధం’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని