మరియమ్మ కేసులో తార్కిక ముగింపునివ్వండి

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు కస్టడీలో మరియమ్మ మృతిపై నమోదైన కేసు దర్యాప్తును పూర్తి చేసి తార్కిక ముగింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది. పోలీసులపై నమోదైన కేసు దర్యాప్తును పూర్తి చేయడం రాష్ట్ర బాధ్యత అని,

Published : 30 Nov 2021 05:31 IST

పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు కస్టడీలో మరియమ్మ మృతిపై నమోదైన కేసు దర్యాప్తును పూర్తి చేసి తార్కిక ముగింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది. పోలీసులపై నమోదైన కేసు దర్యాప్తును పూర్తి చేయడం రాష్ట్ర బాధ్యత అని, సత్వరం పూర్తి చేసి ప్రజల్లో విశ్వాసం కల్పించాలని సూచించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినందున తదుపరి ఆదేశాలు అవసరం లేదంటూ పిటిషన్‌పై విచారణను ముగించింది. మరియమ్మ మృతిపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ పౌరహక్కుల సంఘం (పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. గత విచారణ సందర్భంగా ధర్మాసనం.. మరియమ్మ మృతదేహానికి నిర్వహించిన రీపోస్టుమార్టంలో శరీరంపై గాయాలున్నట్లు మెజిస్ట్రేట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొనడంతో ఇది సీబీఐ దర్యాప్తు చేయదగిన కేసు అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై దాఖలు చేసిన కౌంటరు, జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ సమర్పించిన రీపోస్టుమార్టం నివేదిక, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన ధర్మాసనం ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను ముగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని