
నిర్లక్ష్యం వద్దు: మంత్రి సబిత
కరోనా నిబంధనలపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో జలీల్, సుల్తానియా, శ్రీదేవసేన తదితరులు
ఈనాడు, హైదరాబాద్: కరోనా నిబంధనలను పాటించడంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, గతంలోని పరిస్థితి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సోమవారం తన కార్యాలయంలో సమీక్షించారు. విద్యాసంస్థల్లో శానిటైజర్లు వాడేలా, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు వినియోగించేలా పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, వ్యక్తిగత దూరం, పరిశుభ్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశాఖ అప్రమత్తం...
రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్, మూడో ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు, ఫావిపిరవిర్ మాత్రలు, యాంపొటెరిసిన్ ఇంజెక్షన్లు, గ్యాస్ట్రోరెసిస్టెంట్ మాత్రలను వైద్య ఆరోగ్యశాఖ సమకూర్చుకుంటోంది. భారీ సంఖ్యలో పీపీఈ కిట్లు, శానిటైజర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ఎన్-95 మాస్కుల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు మోనోక్లోనాల్ మందు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Advertisement