పీజీలోనూ  ఉమ్మడి విద్యా ప్రణాళిక

రాష్ట్రమంతటా పీజీలోనూ ఉమ్మడి విద్యా ప్రణాళిక(కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌) అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాల

Updated : 01 Dec 2021 05:50 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, పక్కన జేఎన్‌టీయూహెచ్‌

వీసీ నర్సింహారెడ్డి, వి.వెంకటరమణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రమంతటా పీజీలోనూ ఉమ్మడి విద్యా ప్రణాళిక(కామన్‌ అకడమిక్‌ క్యాలెండర్‌) అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిగ్రీలో అమలు చేస్తున్నట్లు.. అన్ని వర్సిటీల్లోనూ పీజీ కోర్సుల్లో ఒకేసారి తరగతుల ప్రారంభం, పరీక్షల నిర్వహణకు ఉమ్మడి విద్యా ప్రణాళికను అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ నెల 13న సమావేశమై క్యాలెండర్‌ను రూపొందించాలని లింబాద్రి ఆదేశించారు. సమావేశంలో విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ వి.వెంకటరమణ, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు నర్సింహారెడ్డి, రవీందర్‌, తాడికొండ రమేశ్‌, గోపాల్‌రెడ్డి, మల్లేశ్‌, లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, రవీందర్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం లింబాద్రి విలేకర్లతో మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే న్యాక్‌లో దేశంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 130 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా 2014లో కేవలం 24 మాత్రమే న్యాక్‌ గుర్తింపు పొందాయని.. ఇప్పుడు ఆ సంఖ్య 88కి పెరిగిందని చెప్పారు.

మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు

ప్రైవేట్‌ అనుబంధ కళాశాలలు న్యాక్‌ గుర్తింపు పొందేలా వర్సిటీలు కార్యశాలలు నిర్వహించాలి. ముందుకొచ్చే కళాశాలలకు ప్రోత్సాహంగా ఉన్నత విద్యామండలి రూ.లక్ష అందజేస్తుంది.

కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. సిబ్బంది, 18 ఏళ్లు దాటిన విద్యార్థులు అందరూ టీకా తీసుకోవాలి.

ర్యాగింగ్‌ నివారణకు చర్యలు తీసుకోవాలి. పోస్టర్లు ముద్రించి ప్రాంగణాల్లోని ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శించాలి.

విద్యార్థుల్లో మానసిక సమస్యలను గుర్తించి కౌన్సెలింగ్‌ చేసేలా మెంటార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. సైకాలజిస్టులతో కార్యక్రమాలు నిర్వహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని