‘మూడో దశ’ను నివారించగలిగేది టీకానే

‘‘దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వచ్చింది.. రేపు మన దగ్గర కూడా మరో కొత్త వేరియంట్‌ పుట్టుకురావచ్చు. అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం టీకాకు ఉంది’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌

Published : 01 Dec 2021 04:36 IST

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వచ్చింది.. రేపు మన దగ్గర కూడా మరో కొత్త వేరియంట్‌ పుట్టుకురావచ్చు. అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం టీకాకు ఉంది’’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. మూడో దశ ఉద్ధృతిని నివారించగలిగే సమర్థత టీకాకుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక డోసు టీకా పంపిణీ 90 శాతం పూర్తి కాగా.. 46 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయన్నారు. డిసెంబరు నెలాఖరుకు అందరికీ రెండు డోసులు పూర్తయ్యే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. రెండు డోసులు స్వీకరించడం ద్వారానే కొవిడ్‌ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని తేల్చిచెప్పారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ‘‘12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిడ్‌ రిపొర్ట్‌ వచ్చే వరకూ విమానాశ్రయంలోనే ఉండాలి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడికీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందజేస్తాం. నెగిటివ్‌ వస్తే.. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తున్నాం. రెండో డోసు వేసుకోకున్నా వేసుకున్నట్లు కొందరికి సంక్షిప్త సందేశం వచ్చిన విషయంపై ముగ్గురు వైద్యాధికారులు, కొందరు సిబ్బందిని సస్పెండ్‌ చేశాం. ప్రైవేటు ఆసుపత్రులపై, వ్యాక్సినేషన్‌లో జాప్యం వంటి అంశాలపై 9154170960 నంబరుకు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి’’ అని శ్రీనివాసరావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని