జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర వర్సిటీలు వెలవెల

వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల జాబితాలో రాష్ట్ర వర్సిటీలు వెలవెలబోయాయి. 2019లో పదో స్థానంలో ఉన్న ఆచార్య జయశంకర్‌ వర్సిటీ 2020కల్లా 30వ ర్యాంకుకు దిగజారిందని భారత వ్యవసాయ పరిశోధనా

Published : 04 Dec 2021 05:28 IST

10 నుంచి 30కి జయశంకర్‌, 62కు ఉద్యాన విశ్వవిద్యాలయం
చివర నుంచి 4, 6 స్థానాల్లో పశువైద్య, ఉద్యాన వర్సిటీలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల జాబితాలో రాష్ట్ర వర్సిటీలు వెలవెలబోయాయి. 2019లో పదో స్థానంలో ఉన్న ఆచార్య జయశంకర్‌ వర్సిటీ 2020కల్లా 30వ ర్యాంకుకు దిగజారిందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) శుక్రవారం ప్రకటించిన తాజా జాబితాలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల పనితీరు ఆధారంగా ఐసీఏఆర్‌ ఏటా ర్యాంకులను ప్రకటిస్తుంది. 2020 సంవత్సరానికి దేశంలోని 67 వర్సిటీల్లో శ్రీ కొండా లక్ష్మణ్‌  ఉద్యాన విశ్వవిద్యాలయం చిట్టచివరి నుంచి 6వ స్థానం (62వ ర్యాంకు), పీవీ నరసింహారావు పశువైద్య వర్సిటీ చివరి నుంచి 4వ స్థానం(64వ ర్యాంకు)లో ఉన్నాయి. ఉద్యాన వర్సిటీ 2019 జాబితాలో 33వ స్థానంలో ఉండగా ఇప్పుడు (2020) 62కు పడిపోయింది.హరియాణా రాష్ట్రం కర్నాల్‌లోని జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 11వ స్థానంలో, పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం 49, తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 57వ ర్యాంకు సాధించాయి.

ఎందుకీ దుస్థితి..

రాష్ట్రంలో జయశంకర్‌ వర్సిటీ ఒక్కటే పరిశోధనల అంశంలో కాస్త మెరుగ్గా ఉంది. ఉద్యాన, పశువైద్య వర్సిటీల పనితీరు నామమాత్రంగా ఉందన్న విమర్శలున్నాయి. ఇవి ఏర్పాటై ఏడేళ్లయినా ప్రభుత్వం వాటికి ఇంతవరకు పాలక మండళ్లను నియమించలేదు. ఒక్కో వర్సిటీలో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాణ్యమైన అధిక దిగుబడి సాధించే పండ్లు, కూరగాయల వంగడాలను రైతులకు ఇవ్వడంలోగానీ, ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయడంలోగానీ ఉద్యాన వర్సిటీ చొరవ చూపడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని