
Disha Case: చటాన్‌పల్లికి నేడు సిర్పుర్కర్ కమిషన్
ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించనున్న బృందం
ఈనాడు, హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణ చేస్తున్న జస్టిస్ సిర్పుర్కర్ త్రిసభ్య కమిషన్ బృందం శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సిర్పుర్కర్, సభ్యులు జస్టిస్ రేఖాసుందర్ బల్డోటా, కార్తికేయన్ ఆదివారం చటాన్‌పల్లికి వెళ్లనున్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో క్షేత్రస్థాయి అంశాల్ని ఈ బృందం పరిశీలించనుంది. ఎన్కౌంటర్ స్థలంతోపాటు ‘దిశ’ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని, దర్యాప్తు సమయంలో నిందితులను ఉంచిన గెస్ట్‌హౌస్‌ను పరిశీలించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కమిషన్ బృందానికి సీఆర్పీఎఫ్ బలగాలు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనున్నాయి. యువ వైద్యురాలు ‘దిశ’పై అత్యాచారం చేసి మృతదేహాన్ని కాల్చేసిన కేసులోని నలుగురు నిందితులు 2019 డిసెంబరు 6న చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై విచారణ తుది నివేదికను వచ్చే ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.