ఉద్యోగుల కేటాయింపులో ‘స్థానికత’ ప్రస్తావన ఏదీ?

సీనియారిటీతో పాటు స్థానిక, ఖాళీల దామాషాను కూడా పరిగణనలోకి తీసుకొని నూతన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన

Published : 07 Dec 2021 05:01 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎస్‌యూటీఎఫ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: సీనియారిటీతో పాటు స్థానిక, ఖాళీల దామాషాను కూడా పరిగణనలోకి తీసుకొని నూతన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జీవో 317లో స్థానిక కేడర్లలో ఉద్యోగుల కేటాయింపునకు సీనియారిటీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటామని ఉన్న నేపథ్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తమ అభ్యంతరాలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాశారు. నూతన జిల్లాల్లో ఉద్యోగుల సమతుల్యత పాటించడంపై నిర్దిష్ట సూచనలు లేవని, ఉద్యోగుల కేటాయింపులో స్థానికత ప్రస్తావనే లేదన్నారు. ఖాళీల సంఖ్య ఏ విధంగా ఉండబోతుందో స్పష్టత లేదని, జిల్లా/జోనల్‌/మల్టీ జోనల్‌ కేడర్లలో సీనియారిటీ ప్రకారం ఉద్యోగులను కోరుకున్న జిల్లాకు కేటాయిస్తే ఖాళీల్లో అసమతుల్యత ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. పదోన్నతులు, నియామకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘానికీ గుర్తింపు ఇవ్వలేదని టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్రతినిధులను మాత్రమే జిల్లా కమిటీ సమావేశాలకు ఆహ్వానించాలనడం సమంజసం కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులనూ ఆహ్వానించాలని వారు కోరారు.

అవి ఏకపక్ష ఉత్తర్వులు: టీఆర్‌టీఎఫ్‌

లక్ష మందికిపైగా ఉన్న ఉపాధ్యాయుల పక్షాన కేడర్‌ ఆప్షన్‌పై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా 317 జీవోను ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిందని తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌(టీఆర్‌టీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని, వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని