కార్మిక సంఘాలతో చర్చలు విఫలం

బొగ్గు గని కార్మికుల సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సాయంత్రం సింగరేణి

Updated : 07 Dec 2021 05:55 IST

సీఎంతో భేటీకి సింగరేణి యాజమాన్యం యత్నాలు

సమ్మెపై చర్చలు జరుపుతున్న కార్మిక నేతలు

శ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: బొగ్గు గని కార్మికుల సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సాయంత్రం సింగరేణి యాజమాన్యం సంఘాల నేతల్ని పిలిచి మరోసారి చర్చలు జరిపింది. ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల జరిగే నష్టాలను వివరించింది. అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ పి.లక్ష్మణ్‌ సమక్షంలో జరిగిన చర్చల్లో యాజమాన్యం ప్రతినిధులుగా డైరెక్టర్‌ (పా, ఫైనాన్స్‌) ఎన్‌.బలరాం, జీఎం (పర్సనల్‌) ఎ.ఆనందరావు, ఏజీఎంలు బి.హన్మంతరావు, కవితా నాయుడు హాజరయ్యారు. తెబొగకాసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్చెమ్మెస్‌, బీఎంఎస్‌ల ప్రధాన కార్యదర్శులు వి.సీతారామయ్య, బి.జనక్‌ప్రసాద్‌, రియాజ్‌ అహ్మద్‌, మాధవ్‌నాయక్‌లతో పాటు ఇతర ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసే అంశం తమ పరిధిలో లేదని, సమ్మె చేయడం వల్ల సంస్థకు నష్టం తప్ప మరొకటి లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. దీనిపై సంస్థ సీఎండీ, డైరెక్టర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిస్తే సమ్మె డిమాండ్లపై పరిష్కారం లభించే అవకాశం ఉందని చర్చల సందర్భంగా ఒక అభిప్రాయానికి వచ్చారు. సమ్మెకు మరో రెండు రోజుల సమయం మిగిలి ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మిక నేతలతో భేటీ అవుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. సమ్మె నోటీసులోని మొదటి డిమాండ్‌ మినహా మిగతావి సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండటంతో వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని కార్మికవర్గం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడానికి సింగరేణి యాజమాన్యం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని