నెల రోజుల్లో ఇంటి స్థలం కేటాయించండి

‘‘స్వాతంత్య్ర సమరయోధుల వల్ల మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. వితంతువులైన వారి భార్యలు ఇంటి స్థలం కోసం అధికారుల ముందు చేయి చాచేందుకు అనుమతించలేం. వారిని గౌరవించడం ఈ కోర్టు బాధ్యత. నిబంధనల ప్రకారం

Published : 20 Jan 2022 05:29 IST

సమరయోధుల సతీమణులను గౌరవించాలి: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘స్వాతంత్య్ర సమరయోధుల వల్ల మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. వితంతువులైన వారి భార్యలు ఇంటి స్థలం కోసం అధికారుల ముందు చేయి చాచేందుకు అనుమతించలేం. వారిని గౌరవించడం ఈ కోర్టు బాధ్యత. నిబంధనల ప్రకారం ఇంటి స్థలం కేటాయించాల్సిందే’’ అని బుధవారం హైకోర్టు అధికారులకు స్పష్టం చేసింది. వరంగల్‌కు చెందిన సమరయోధుడు బైరోజు లక్ష్మయ్య మరణించగా భార్య చుల్కమ్మ ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు 300 గజాలు కాకుండా 80 గజాలే కేటాయించడంతో హైకోర్టును ఆశ్రయించారు. స్థల కేటాయింపుపై లభించిన హామీ మేరకు 2019లో పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు. హామీ అమలవకపోవడంతో తిరిగి పిటిషన్‌ దాఖలు చేయగా ఒకే అంశంపై రెండుసార్లు పిటిషన్‌ వేశారని సింగిల్‌ జడ్జి కొట్టివేశారు. అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నెల రోజుల్లో ప్రభుత్వ విధానం ప్రకారం చుల్కమ్మకు 300 గజాలను కేటాయించాలని అధికారులను ఆదేశించింది.

రెవెన్యూ కేసులపై ఓ నిర్ణయం తీసుకోండి

రెవెన్యూ కేసుల పరిష్కారానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు సూచించింది. ప్రభుత్వం ధరణి కార్యక్రమం చేపట్టిన తరువాత వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునళ్ల నుంచి వచ్చే కేసుల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘సింగిల్‌ విండో పద్ధతి పెట్టడంతో ఈ కోర్టుపై రోజుకు 200 నుంచి 300 కేసులు వచ్చి పడుతున్నాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అందరూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయశాఖకు చెప్పండి. లేని పక్షంలో మేమే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది. మున్సిపల్‌ వివాదానికి సంబంధించి ఓ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు అడ్వొకేట్‌ జనరల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని