
ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు లేనట్లే?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పక్కనపెట్టింది. గత నెల 9వ తేదీన విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్ ఉద్యోగులకు మాదిరిగానే ఆచార్యులకు పదవీ విరమణ వయసును పెంచేందుకు అంగీకరించారు. ఎంత పెంచాలన్న దానిపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని, ప్రతిపాదనలు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగులతో సమానంగా 61, మూడేళ్లు పెంచి 63, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మాదిరిగా 65...అనే మూడు రకాల ప్రతిపాదనలను విద్యాశాఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏమి నిర్ణయం వస్తుందో అని ఎదురుచూసిన సీనియర్ ఆచార్యులు నిరాశకు గురయ్యారు.