
సీఎంను కలవాలి.. లోపలికి పోనివ్వండి..
ప్రగతిభవన్ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్
సోమాజిగూడ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలంటూ.. ప్రగతి భవన్‌కు చేరుకున్న ఏపీ మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అనుమతి లేకపోవడంతో వెనుదిరిగారు. ఆయన బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రగతిభవన్ గేటు వద్దకు చేరుకున్నారు. సీఎంను కలవాలి లోపలికి పంపాలని అక్కడి పోలీసు అధికారులను ఆయన కోరగా, ముందస్తు అనుమతి లేకుండా పంపలేమంటూ వారు నిరాకరించారు. పోలీసు ఉన్నతాధికారి వచ్చి సర్దిచెప్పినా.. సీఎం లేకపోతే మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ జేసీ పట్టుబట్టారు. అందుకైనా అనుమతి ఉండాల్సిందేనని అధికారులు చెప్పడంతో వెనుదిరిగిన జేసీ.. వాహనంతో మరోసారి నేరుగా గేటు వద్దకు చేరుకున్నారు. నడిచి వెళితే పంపరేమో.. వాహనంతోనైనా పంపాలని కోరగా.. మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అపాయింట్‌మెంట్ ఉండాలి.. లేదా ప్రగతి భవన్ నుంచి తమకు ఆదేశాలుండాలని భద్రతా సిబ్బంది జేసీకి తెలిపారు. దీంతో ఆయన ‘నాకు అపాయింట్‌మెంట్ ఏంటి! లోపలకు వెళతా’నంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వారు ససేమిరా అనడంతో జేసీ వెనుదిరిగారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.