సంక్షిప్త వార్తలు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి జూమ్‌ ద్వారా రోజుకు వెయ్యి మందికి వైద్య సలహాలు, అవసరమైన సహాయం అందించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. గురువారం 360 మంది కొవిడ్‌ బాధితులకు వైద్య సహాయం, మందులను

Updated : 21 Jan 2022 06:20 IST

నేటి నుంచి రోజుకు వెయ్యి మంది కొవిడ్‌ బాధితులకు వైద్యం
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ భువనేశ్వరి

ఈనాడు-అమరావతి: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి జూమ్‌ ద్వారా రోజుకు వెయ్యి మందికి వైద్య సలహాలు, అవసరమైన సహాయం అందించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. గురువారం 360 మంది కొవిడ్‌ బాధితులకు వైద్య సహాయం, మందులను అందించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ‘తెలుగుదేశం వర్గాల ద్వారా జూమ్‌ లింక్‌ను ప్రజలకు అందే ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకు టెలిమెడిసిన్‌ ప్రక్రియ పారంభం అవుతుంది.   తెలుగుదేశం వైద్య విభాగం అధ్యక్షుడు జడ్‌.శివప్రసాద్‌ 5వేల మందికి మందులు అందిస్తున్నారు’ అని వివరించారు.  


ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడిగా కృష్ణారావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్సెస్సీ బోర్డు) సంచాలకుడిగా ఎ.కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎస్సెస్సీ బోర్డు సంచాలకుడిగా ఉన్న సత్యనారాయణరెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా ఆయన స్థానంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్‌) సంచాలకుడిగా ఉన్న కృష్ణారావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక విద్యాపీఠం సంచాలకుడిగా అక్కడే సంయుక్త సంచాలకుడిగా ఉన్న ఎం.సోమిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యాపీఠం సంచాలకుడిగా శ్రీహరి ఉండగా ఆయన్ను 10 నెలల క్రితం ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చి మూడు నెలలవుతున్నా శ్రీహరికి విద్యాశాఖ పోస్టింగ్‌ ఇవ్వకపోవడం గమనార్హం.


యథాతథంగా టైప్‌ రైటింగ్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయగా.. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోని టైప్‌ రైటింగ్‌ పరీక్షలు మాత్రం ఈ నెల 22, 23 తేదీల్లో యథాతథంగా జరుపుతున్నారు. దీంతో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే మిగిలిన పరీక్షలను ఒక అభ్యర్థి నాలుగైదు రోజులు రాయాల్సి ఉంటుందని, టైప్‌ రైటింగ్‌కు కేవలం 2 గంటల పరీక్షే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


ఓబీసీ కమిషన్‌ ముందు కరీంనగర్‌ సీపీ

ఈనాడు, హైదరాబాద్‌: కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్‌ అరెస్టుపై గురువారమిక్కడ ఓబీసీ కమిషన్‌ నిర్వహించిన విచారణకు కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ, డీసీపీ, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. కరోనా నిబంధనలు ఒక్క భాజపాకే వర్తిస్తాయా? ఇతర పార్టీలకు వర్తించదా? అని ఈ సందర్భంగా కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రజలతో ధర్నాలు చేస్తుంటే ఎందుకు అమలు చేయలేదని అడిగారు. సంజయ్‌ తన ఇంట్లో ధర్నా చేసుకుంటున్నపుడు బయట పోలీసు భద్రత కల్పిస్తే సరిపోయేది కదా? ఎందుకు బలవంతంగా ప్రవేశించారు? అని కమిషన్‌ అడిగింది. నిబంధనల ప్రకారమే చేశామని, దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని పోలీసు కమిషనర్‌ వివరించారు.  


దక్షిణాది రాష్ట్రాల బీసీ మహాసభ 25న

నల్లకుంట, న్యూస్‌టుడే: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 25న ‘దక్షిణాది రాష్ట్రాల బీసీ మహాసభ’ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో నిర్వహించే మహా సభకు పలు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో దిల్లీలో జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మహాసభౖi సంబంధించిన గోడపత్రికలు, కర పత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్‌, రాజేందర్‌, అంజి, జయంతి, చంటి, జోషి రాఘవ పాల్గొన్నారు.


రెండు జాతీయ రహదారుల విస్తరణకు రూ.1,294 కోట్ల మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసింది. మహబూబ్‌నగర్‌, కోస్గి, కొడంగల్‌ మీదుగా చించోలికి వెళ్లే రహదారికి రూ.703.68 కోట్లు, సిద్దిపేట-ఎలకతుర్తి మార్గానికి రూ.590.72 కోట్లు కేటాయించింది. మహబూబ్‌నగర్‌-చించోలి మార్గానికి పరిపాలనా అనుమతి మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విటర్‌ ద్వారా తెలిపారు.


వీఆర్వోల సర్దుబాటపై కసరసత్తు!

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారులను (వీఆర్వో) సర్దుబాటు చేసే అంశంపైనే ఐఏఎస్‌ల కమిటీ మొదటగా దృష్టిసారించనున్నట్లు తెలిసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, రెవెన్యూతో పాటు ఇతర శాఖల్లో వారిని సర్దుబాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ శేషాద్రి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.


సివిల్స్‌ అభ్యర్థులకు ఉచిత పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: జూన్‌లో యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రతి ఆదివారం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉచిత టెస్ట్‌సీరిస్‌ను నిర్వహిస్తామని ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఛైర్మన్‌ కృష్ణప్రదీప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు 9133237733, 8686233879 నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని