Updated : 23 Jan 2022 06:08 IST

పండ్లను మాగబెట్టడంలో ఇథెఫాన్‌ వినియోగం చట్టబద్ధమే

ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: పండ్లను కృత్రిమంగా మాగబెట్టడానికి ఇథెఫాన్‌ను వినియోగించడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని కేవలం గ్యాస్‌ రూపంలోనే వినియోగిస్తున్నారని, ఇది కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చట్టానికి, నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. అందువల్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2018లో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోజాలమంది. అంతేగాక ఎన్‌రైప్‌ వినియోగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోనూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంది. ఇథలిన్‌ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్‌రైప్‌ వినియోగించాలని ప్రభుత్వం రైతులను, వ్యాపారులను చైతన్యం చేస్తోందని పేర్కొంది. ఇథెఫాన్‌ వినియోగానికి అనుమతిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2018లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నళిన్‌ వెంకటకిశోర్‌కుమార్‌, మరొకరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు, పలువురి పిటిషన్‌లను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి కార్బైడ్‌ వినియోగంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని గతంలో ‘ఈనాడు’ రాసిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టింది. అనంతరం ఇదే అంశంపై కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో దానిపై విచారణను మూసివేసింది. సైంటిఫిక్‌ కమిటీలోని నిపుణుల అభిప్రాయం, సలహాల మేరకు పలు నిబంధనలు రూపొందించి 2016లో జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటరులో పేర్కొంది. అయితే పలు వినతి పత్రాల నేపథ్యంలో కార్బైడ్‌కు బదులుగా ఇథెఫాన్‌కు అనుమతిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. ఇది కేంద్ర క్రిమిసంహాకరక మండలి, రిజిస్ట్రేషన్‌ కమిటీలో కూడా రిజిస్టర్‌ అయిందని పేర్కొంది. కోర్టు సహాయకుడిగా ఉన్న సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి నివేదిక సమర్పిస్తూ ఇథెఫాన్‌ రసాయనమని, ఇథర్నల్‌కు ప్రత్యామ్నాయమని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఇథెఫాన్‌ వినియోగానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేయాలన్న ప్రశ్నే రాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని