కీలక ప్రాజెక్టుల అప్పగింతపై నేడు చర్చ

గోదావరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయమై చర్చించేందుకు సోమవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)

Published : 24 Jan 2022 05:04 IST

వర్చువల్‌గా సమావేశం కానున్న గోదావరి బోర్డు ఉప సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయమై చర్చించేందుకు సోమవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఉప సంఘ సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఉన్న బోర్డు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు చెందిన సంఘ సభ్యులతో ఈ సమావేశం కొనసాగనుంది. తెలంగాణ వైపు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీ బ్యారేజీ, దేవాదుల ఎత్తిపోతల పథకం, ఏపీలో సీలేరుతో పాటు మరో మూడు కాంపోనెట్లను బోర్డుకు అప్పగించే అంశంపై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. సంక్రాంతికి ముందు జరగాల్సిన ఈ సమావేశం కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా వాయిదా పడింది.

ఆర్డీఎస్‌ కాల్వల పరిశీలనకు బృందం

రాజోలి బండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) నుంచి ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆయకట్టుకు కేటాయింపుల ప్రకారం నీరందడం లేదని, ఆర్డీఎస్‌ను బోర్డు పరిధిలో చేర్చాలని తెలంగాణ ఇప్పటికే కృష్ణా బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఉమ్మడి మహబూబ్నగర్‌ జిల్లాలోని జూరాల, 27న తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్‌ ఆనకట్ట, తెలంగాణ వైపు ఉన్న ఎడమ కాల్వతో పాటు ఏపీ వైపు ఉన్న కుడి కాల్వ, సుంకేశుల బ్యారేజీలను కృష్ణా బోర్డు అధికారుల బృందం పరిశీలించనుంది. రానున్న కాలంలో సాగు, తాగునీటి అవసరాలను సోమవారం నాటికి అందజేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖలు రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని