
మా పోరాటానికి మద్దతివ్వండి
రాజకీయ పార్టీలను కోరిన ఉపాధ్యాయులు
ఈనాడు, హైదరాబాద్: బదిలీలకు సంబంధించిన 317 జీవో ఉత్తర్వులను రద్దు చేయాలనే డిమాండ్‌తో చేసే తమ పోరాటానికి మద్దతు పలకాలని వివిధ రాజకీయ పార్టీలను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) కోరింది. ఈ మేరకు యూఎస్పీసీ నేతలు సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.రమ, కె.గోవర్ధన్, సీపీఎం, తెజస నాయకులను కలిశారు. వారు తమ పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. ఈ నెల 29న కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలకు, ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాకు మద్దతు పలకడంతో పాటు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినట్లు స్టీరింగ్ కమిటీ నేతలు పేర్కొన్నారు.
స్పౌస్‌లకు బదిలీల్లో పాయింట్లు ఇవ్వొద్దు
భార్యాభర్తల విభాగంలో ఒక జిల్లాకు వెళ్లాలని ప్రభుత్వం కోరితే వెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అందువల్ల ఇక నుంచి బదిలీలు జరిగినప్పుడు వారికి ప్రత్యేకంగా పాయింట్లు ఇవ్వవద్దని నాన్ స్పౌస్ టీచర్స్ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోకల శేఖర్, ప్రధాన కార్యదర్శి ఎం.సక్కుబాయి సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు.