
తెలంగాణ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఏపీ నుంచి 31.83 లక్షల టన్నులు
ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో వడ్ల సేకరణ సరళంగా సాగుతున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ వెల్లడించింది. ఈ మార్కెటింగ్ సీజన్లో జనవరి 24వ తేదీనాటికి తెలంగాణ నుంచి 69,08,432 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు పేర్కొంది. ఇందుకోసం 10,29,511 మంది రైతులకు రూ. 13,540.52 కోట్ల మేర కనీస మద్దతు ధర చెల్లించినట్లు తెలిపింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని 3,18,577 మంది రైతులకు రూ. 4,279.76 కోట్లు చెల్లించి 31,83,522 మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నామంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 77,00,640 మంది రైతులకు రూ. 1,18,812.56 కోట్ల ఎంఎస్పీ చెల్లించి రూ. 6,06,18,653 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు పేర్కొంది. 2020-21 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌కు సంబంధించి తెలంగాణలో 1,41,08,787 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 84,57,120 మెట్రిక్ టన్నులు తీసుకున్నామని వెల్లడించింది.