వ్యాక్సిన్‌ రెండో డోస్‌పైతప్పుడు లెక్కలు

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో లోపాలు మరోసారి వెలుగు చూశాయి. రెండో డోస్‌ తీసుకోకపోయినా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కి సందేశాలు వస్తున్నాయని కొందరు, కేంద్రాలకు వెళితే ఇప్పటికే డోసులు పూర్తయినట్లు

Published : 25 Jan 2022 05:09 IST

తీసుకోకున్నా పూర్తయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు

ఈటీవీ, సంగారెడ్డి: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో లోపాలు మరోసారి వెలుగు చూశాయి. రెండో డోస్‌ తీసుకోకపోయినా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కి సందేశాలు వస్తున్నాయని కొందరు, కేంద్రాలకు వెళితే ఇప్పటికే డోసులు పూర్తయినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోందని మరికొందరు ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర మెగా కిచెన్‌ వద్ద సోమవారం నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్‌ శిబిరం వద్ద ఇలాంటివే మరోసారి బయటపడ్డాయి. టీకా తీసుకుంటే ఉచితంగా నిత్యావసరాల కిట్‌ను పంపిణీ చేస్తుండటంతో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కొవిన్‌ వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్‌ సమయంలో చాలా మందికి చుక్కెదురైంది. ఇప్పటికే రెండో డోసు తీసుకున్నట్లు చూపించడంతో అక్షయపాత్ర సిబ్బంది ఏం చేయలేకపోయారు. తాము తీసుకోలేదని, ఎందుకు ఇలా నమోదు చేశారోనంటూ పలువురు వాపోయారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉన్నారు. అర్హులైన 204 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, 400 మంది వరకు అనర్హులుగా తేలడంతో వెనుతిరిగారని అక్షయపాత్ర ప్రతినిధి సంగప్ప తెలిపారు. వెనక్కి వెళ్లిన వారిలో కొంత మంది కంది పీహెచ్‌సీకి వెళ్లి ఈ విషయమై ప్రశ్నించగా వారికి రెండో డోసు తీసుకోలేదని పీహెచ్‌సీ సిబ్బంది లేఖ ఇచ్చారు. దీంతో వారికి వ్యాక్సిన్‌ వేశారు. ఈ సమస్యపై కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డా.ప్రశాంత్‌ను వివరణ కోరగా.. రెండో డోసుకు నిర్ణీత గడువు తర్వాత 15 రోజుల్లో రాకపోతే వారికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వెబ్‌సైట్లో అప్‌డేట్‌ చేశామన్నారు. జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవితో ప్రస్తావించగా.. పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని