3 అంశాలు పరిష్కరిస్తేనే చర్చలకు..

పీఆర్‌సీపై ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల/రద్దు చేయాలని, అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటేనే చర్చలకు సానుకూల వాతావరణం నెలకొంటుందని తేల్చిచెప్పారు.

Published : 26 Jan 2022 06:09 IST

ఏపీ మంత్రుల కమిటీకి స్పష్టం చేసిన పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: పీఆర్‌సీపై ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలుపుదల/రద్దు చేయాలని, అశుతోష్‌మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, జనవరి నెలకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటేనే చర్చలకు సానుకూల వాతావరణం నెలకొంటుందని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఒకసారి ఉత్తర్వులిచ్చాక వాటిని నిలిపేయడం సరికాదని పీఆర్‌సీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ వారికి వివరించింది. ఉద్యోగ సంఘాల ముఖ్యనేతలతో కలిసి ఈ నెల 27న చర్చలకు రావాలని ఆహ్వానించింది. పీఆర్‌సీపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ ఆహ్వానం మేరకు.. మంగళవారం ఆస్కార్‌రావు, వైవీరావు తదితర తొమ్మిది మందితో కూడిన సాధన సమితి ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయానికి వచ్చింది. తాము ప్రతిపాదించిన అంశాలపై లేఖ అందించింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో సుమారు గంటకుపైగా వారు సమావేశమయ్యారు. అనంతరం సజ్జల విలేకరులతో మాట్లాడారు.

ఉద్యోగుల జీతాల్లో రూపాయి తగ్గనీయం
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించి.. రూపాయి తగ్గకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఫిట్‌మెంట్‌కు సంబంధించిన అంశం పరిష్కారమైందని, మిగిలినవేవైనా ఉంటే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వం.. వారు అడిగినా అడక్కపోయినా చేయగలిగనంతా చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని