ముప్పుతిప్పలు పెట్టిన ధరణి పోర్టల్‌

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్‌ ధరణి మంగళవారం రైతులను, రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఉదయం నుంచే అనేక జిల్లాల్లో సేవలు స్తంభించి పోయాయి. మీసేవా కేంద్రాల్లో స్లాట్ల నమోదు, ఛార్జీల స్వీకరణ కూడా పూర్తికాకపోవడంతో రైతులు బారులుతీరారు.

Published : 26 Jan 2022 06:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్‌ ధరణి మంగళవారం రైతులను, రెవెన్యూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఉదయం నుంచే అనేక జిల్లాల్లో సేవలు స్తంభించి పోయాయి. మీసేవా కేంద్రాల్లో స్లాట్ల నమోదు, ఛార్జీల స్వీకరణ కూడా పూర్తికాకపోవడంతో రైతులు బారులుతీరారు. తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో ముందటి రోజు నమోదైన స్లాట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు కూడా పూర్తికాలేదు. తహసీల్దారు డెస్క్‌టాప్‌ తెరపై గుండ్రని చక్రం గంటల తరబడి తిరుగుతూ సర్వర్‌ సమస్యను చూపించింది. దీనిపై చాలా జిల్లాల్లో కలెక్టరేట్లకు ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల పెంపు నేపథ్యంలో సర్వర్‌ నెమ్మదించినట్లు సమాచారం. కొత్త ఛార్జీలను ఆన్‌లైన్‌ చేస్తున్న క్రమంలోనే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే లోపు ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు లావాదేవీలు పూర్తి చేసుకోవాలని రైతులు, భూ యజమానులు మీసేవా, తహసీల్దారు ఆఫీసుల వద్ద బారులు తీరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని