
కొత్త మార్కెట్ విలువల అమలుకు వడివడిగా అడుగులు
29లోపు జిల్లా కమిటీల ఆమోదం
నేడు కీలక సమావేశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలు దిశగా కార్యాచరణను వేగవంతం చేశారు. కొత్త మార్కెట్ విలువలు అమలుకు వీలుగా చట్టబద్ధమైన, సాంకేతిక పరమైన అంశాలపై రిజిస్ట్రేషన్ శాఖ నేటి నుంచి కసరత్తు చేయనుంది. పెంపు ప్రతిపాదనలు, రాబడి అంచనాలు సమగ్రంగా ప్రభుత్వం పరిశీలించిన నేపథ్యంలో అమలుకు వీలుగా తదుపరి ప్రక్రియకు గురువారం శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా సమావేశమై పెంపు ప్రతిపాదనలను సమీక్షించి జిల్లా కమిటీల ఆమోదానికి పంపనున్నారు. 29లోపు జిల్లా కమిటీల ప్రక్రియ పూర్తి చేసి దీనికి అనుగుణంగా 30, 31వ తేదీల్లో వెబ్‌సైట్‌లో సాంకేతిక పరమైన మార్పులు చేయనున్నారు.ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కార్డ్ సాంకేతికతతో కొత్తమార్కెట్ విలువలు అనుసంధానం చేయనున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన అన్ని సాంకేతిక అంశాలపై రిజిస్ట్రేషన్‌ల శాఖ సాంకేతిక విభాగం దృష్టి సారించింది.