
సుప్రసిద్ధ కథా రచయిత ‘శ్రీవిరించి’ కన్నుమూత
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రముఖ కథా రచయిత, తత్వవేత్త ‘శ్రీవిరించి’గా సుప్రసిద్ధులైన డాక్టర్ ఎస్.సి.రామానుజాచారి (87) బుధవారం చెన్నైలో కన్నుమూసినట్లు ఆయన సోదరుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్య (చక్రవర్తి) తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన తెలుగు పండితులు, ప్రముఖ కవి ఎన్.సి.ఎస్.వెంకటేశ్వరాచార్యులు, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 1935లో జన్మించిన రామానుజాచారి ‘శ్రీవిరించి’ కలం పేరుతో అక్షర సేద్యం చేశారు. పదేళ్ల కిందటే ఆయన సతీమణి కన్నుమూయగా, చెన్నైలోని కుమార్తె వద్ద ఉంటున్నారు. రాజనీతిశాస్త్రంలో ఎంఏ చేసిన ఆయన పారిశ్రామిక, వాణిజ్య చట్టాల్లో న్యాయవిద్యనభ్యసించారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు. . 1951 నుంచి తెలుగు స్వతంత్ర, భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, వివిధ పత్రికల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో కథలు, వ్యాసాలు రాశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహా డా.దాశరథి రంగాచార్య, కమలా సాహిత్య పురస్కారాలు అందుకున్నారు.