National Highway: కల్వకుర్తి- నంద్యాల జాతీయ రహదారి మార్గ ప్రణాళిక ఖరారు

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా నది మీదుగా నిర్మించే జాతీయ రహదారి మార్గ ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం కల్వకుర్తి (తెలంగాణ)- నంద్యాల (ఆంధ్రప్రదేశ్‌) మధ్య 173.73 కిలోమీటర్ల మేర మార్గాన్ని నిర్మించనున్నారు.

Published : 27 Jan 2022 08:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా నది మీదుగా నిర్మించే జాతీయ రహదారి మార్గ ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం కల్వకుర్తి (తెలంగాణ)- నంద్యాల (ఆంధ్రప్రదేశ్‌) మధ్య 173.73 కిలోమీటర్ల మేర మార్గాన్ని నిర్మించనున్నారు. దీనికి జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 167కే) నంబరు కేటాయించారు. రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం గణనీయంగా పెరిగేందుకు ఈ మార్గం ఉపకరించనుంది. ఈ మార్గాన్ని ఇతర జాతీయ రహదారుల మాదిరిగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మార్గంలో చేపట్టే బైపాస్‌రోడ్ల అలైన్‌మెంటు మార్పులను ఆమోదించింది. తెలంగాణలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, రాంపూర్‌, ఆంధ్రప్రదేశ్‌ లోని మండుగుల, శివాపురం, కరివేన మీదుగా నంద్యాల వరకు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం గతంలో ఆమోదించింది. ఈ మార్గంలో రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా కృష్ణా నదిపై సోమశిల వద్ద వంతెనను ఐకానిక్‌ బ్రిడ్జిగా నిర్మించాలని కేంద్రం సూచించింది. అందుకు సంబంధించిన మార్గ ప్రణాళికల్లో మార్పులను సైతం ఆమోదించింది. ఈ మార్గంలోని పది ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని