ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌రావు (63) శుక్రవారం ఉదయం గుండెపోటుతో దోమల్‌గూడలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

Published : 29 Jan 2022 04:29 IST

రవీంద్రభారతి, కవాడిగూడ, న్యూస్‌టుడే: ప్రముఖ కవి, రచయిత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌రావు (63) శుక్రవారం ఉదయం గుండెపోటుతో దోమల్‌గూడలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో తెలుగు విభాగం ఆచార్యుడిగా, తెలుగు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు. సుధాకర్‌ 1959 జనవరి 21న నిజామాబాద్‌ జిల్లా పాములబస్తీలో జన్మించారు. తల్లిదండ్రులు శాంతాబాయి, దేవయ్య. 1985-1990 మధ్య సికింద్రాబాద్‌లోని వెస్లీ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత 1990-2019 మధ్య పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా సేవలందించారు. ఇందులో సుదీర్ఘకాలం రాజమండ్రి పీఠంలోనే పనిచేశారు. విశ్వవిద్యాలయం ప్రచురించే వాంగ్మయి సాహితీ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. 2019 సెప్టెంబరులో హెచ్‌సీయూ తెలుగు విభాగంలో ఆచార్యుడిగా చేరి.. లిటరరీ ఛైర్‌ డీన్‌గా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు అకాడమీ, తెలుగు సలహామండలి సభ్యుడిగా సేవలందించారు. ఎన్నో హిందీ, ఉర్దూ కవితలను తెలుగులోకి అనువదించారు. వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, అటజనిగాంచె, కథానాయకుడు జాషువా, తొలి వెన్నెల లాంటి పలు పుస్తకాలను రచించారు. గుర్రం జాషువా రచనలపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. గోసంగి అనే కవిత రచించారు. సుధాకర్‌రావు సతీమణి హేమలత మూడేళ్ల కిందట దివంగతులయ్యారు. వారికి మానస, మనోజ్ఞ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారం కిందటే చిన్నకుమార్తె వివాహం చేశారు. ఆయన మరణంతో బంధుమిత్రులు, సాహితీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సాయంత్రం నారాయణగూడ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పలువురు సాహితీవేత్తలు సుధాకర్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని