Hardik Pandya : గుజరాత్‌ సక్సెస్‌ వెనుక స్టోరీ అదే: హార్దిక్‌

తొలి క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్‌లో...

Updated : 25 May 2022 11:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తొలి క్వాలిఫయిర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుత విజయంతో గుజరాత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిన్న రాత్రి (మే 24న) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 188/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ‘‘మైదానం లోపల, వెలుపల సమతూకంగా ఉండేలా చూసుకుంటున్నాను. కెప్టెన్‌గా ఎంతో నేర్చుకుంటున్నా. గత కొన్నేళ్లుగా నా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నా’’ అని పేర్కొన్నాడు. 

తొలిసారి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్య గుజరాత్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనలోనూ మెరుగుపడ్డాడు. ఇప్పటి వరకు 15 మ్యాచుల్లో 453 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ఈ సీజన్‌లో ఇలా రాణించడంలో నా కుటుంబ సభ్యులదే కీలక పాత్ర. అందులో నా భార్య, కొడుకు, నా సోదరుడు సహా అందరూ మద్దతుగా నిలిచారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండగలుగుతున్నా. ఇకపోతే సీజన్‌ ముగిశాక ఇంటికెళ్లి నా కుటుంబంతో సమయం గడపాలి. అదే నన్ను ఉత్తమ క్రికెటర్‌గా మారుస్తుంది’’ అని వివరించాడు. 


డేవిడ్ మిల్లర్‌ అలాంటి సమర్థుడే: హార్దిక్ 

గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడం ఎలా అనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఇప్పుడైతే ఎలాంటి భావోద్వేగం లేదు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. అద్భుత విజయం సాధించడం వెనుక జట్టు సభ్యుల కృషి ఎంతో ఉంది. డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎంతో బాగుంది. మా టీమ్‌లోని 23 మంది ఆటగాళ్లు వేర్వేరు క్యారెక్టర్లు కలిగినవారు. అందుకే వేర్వేరు ఆలోచనలను పంచుకోగలిగాం. మంచివాళ్లు పక్కన ఉంటే మంచి ఆలోచనలే వస్తాయి. ఇదే ఇప్పటి వరకు మా సక్సెస్‌ వెనుక ఉన్న స్టోరీ. జట్టు గెలవాలని డగౌట్‌లోనూ మా ఆటగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రషీద్‌ ఖాన్‌ సీజన్‌ మొత్తం బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. డేవిడ్‌ మిల్లర్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సమర్థుడు. మిల్లర్‌ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఇకపోతే నేను జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు వస్తా. ఈ ప్లేస్‌లోనే బ్యాటింగ్‌కు వెళ్తాననే డిమాండ్‌ ఎప్పుడూ ఉండదు’’ అని హార్దిక్‌ స్పష్టం చేశాడు. ఇవాళ జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో తొలి క్వాలిఫయిర్‌లో ఓటమిపాలైన రాజస్థాన్‌ మే 27న రెండో క్వాలిఫయర్‌ పోరులో తలపడుతుంది. అనంతరం అక్కడ గెలిచిన జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ను ఢీకొడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని