MS Dhoni: జడేజా ఆటపై కెప్టెన్సీ భారం.. అందుకే: ధోనీ

కెప్టెన్సీ భారం.. రవీంద్ర జడేజా ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపించిందని, అందుకే నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీ20 మెగా టోర్నీలో మళ్లీ చెన్నై బాధ్యతలు అందుకున్న ధోనీ

Published : 02 May 2022 10:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్సీ భారం.. రవీంద్ర జడేజా ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపించిందని, అందుకే నాయకత్వ మార్పు చేయాల్సి వచ్చిందని చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. టీ20 మెగా టోర్నీలో మళ్లీ చెన్నై బాధ్యతలు అందుకున్న ధోనీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్నాడు. గత రాత్రి పుణె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో మూడో గెలుపు సాధించింది.

మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌ అయిన తర్వాత చాలా విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత ఆట తీరు పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఆలోచనతో కూడుకున్న వ్యవహారం. మన మెదడును నియంత్రణలో ఉంచడం అంత సులువైన పని కాదు. శరీరం విశ్రాంతి తీసుకున్నా సరే.. మెదడు పనిచేస్తూనే ఉంటుంది. జడేజా విషయంలోనూ అదే జరిగిందని అనుకుంటున్నా. కెప్టెన్సీ భారం అతడి ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. బౌలర్‌, బ్యాటర్‌, ఫీల్డర్‌గా జడేజా గొప్ప ప్రదర్శన చేస్తాడు. కానీ ప్రస్తుతం మేం గొప్ప ఫీల్డర్‌ను కోల్పోయాం. మిడ్‌ వికెట్‌ ఫీల్డింగ్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నాం. 17-18 క్యాచ్‌లను కూడా వదిలేశాం. ఇది చాలా అందోళన కలిగించింది. అందుకే మార్పు చేయాల్సి వచ్చింది. కెప్టెన్సీ అనేది నిష్పక్షపాతమైన అంశం. నువ్వు(జడేజా) ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. నువ్వు అత్యుత్తమ ఆటగాడివి. ఇదే జట్టుకు కావాల్సింది కూడా’’ అని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది టీ20 మెగా టోర్నీ ప్రారంభమవడానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు అందుకున్నాడు. అయితే సారథిగా ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనూ విజయాన్ని సాధించగలిగాడు. అటు ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించడంలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో సారథ్య బాధ్యతలను మళ్లీ ధోనీకి అప్పగిస్తున్నట్లు చెన్నై ఇటీవల ప్రకటించింది.

టీ20 లీగ్‌లో చెన్నైకి నాలుగు సార్లు టైటిల్‌ను అందించిన ధోనీ.. ఈ సీజన్‌లో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్‌, కాన్వే అదిరే ఆరంభాన్నిచ్చారు. 182 పరుగులతో ఈ సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

20 ఓవర్లలో కేవలం 2 వికెట్లే నష్టపోయిన చెన్నై 202 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్‌ ఆరంభంలో దూకుడుగా అనిపించినా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.  13 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని