David Warner: అతడిలా నేనెందుకు ఆడట్లేదని నా పిల్లలకు తెలుసుకోవాలని ఉంది: వార్నర్‌

రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌లా తానెందుకు శతకాలు చేయలేకపోతున్నాననే విషయం తన పిల్లలకు తెలుసుకోవాలని ఉందని దిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు...

Published : 21 Apr 2022 11:28 IST

(Photo: David Warner Instagram)

ముంబయి: రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌లా తానెందుకు శతకాలు చేయలేకపోతున్నాననే విషయం తన పిల్లలకు తెలుసుకోవాలని ఉందని దిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. వాళ్లు ఇప్పుడు క్రికెట్‌ గేమ్‌ను అర్థం చేసుకొంటుండటం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దిల్లీ ఒక వికెట్‌ కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఛేదించింది. వార్నర్‌ (60 నాటౌట్‌; 30 బంతుల్లో 10x4, 1x6) మరోసారి అర్థ శతకంతో మెరిశాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఇలా స్పందించాడు.

‘మా బౌలర్లు అద్భుతంగా రాణించి మా పని మరింత తేలిక చేశారు. క్రెడిట్‌ అంతా వాళ్లకే దక్కుతుంది. లక్ష్య ఛేదనలో పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మా జట్టులో కొవిడ్‌ కేసులు వచ్చాక మేం తిరిగి బరిలోకి దిగి విజయం సాధించడం గొప్పగా ఉంది. ఇదంతా సానుకూల ఆలోచనతోనే సాధ్యమవుతుంది. ఇక పృథ్వీతో కలిసి బ్యాటింగ్‌ చేయడం బాగుంది. నా బ్యాటింగ్‌ విషయానికొస్తే.. ప్రాథమిక అంశాలపై దృష్టిసారించి అందుకు అనుగుణమైన ఫుట్‌వర్క్‌తో ఆడాలనుకున్నా. ఇకపైనా ఇలాగే రాణిస్తాననే నమ్మకం ఉంది. అయితే, జోస్‌ బట్లర్‌లా నేనెందుకు శతకాలు చేయలేకపోతున్నానని నా పిల్లలకు తెలుసుకోవాలని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలందరూ క్రికెట్‌ను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అందుకు నాకు ఆనందంగా ఉంది’ అని వార్నర్‌ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తన పిల్లలు కూడా క్రికెట్‌ను అర్థం చేసుకుంటున్నారని చెప్పాడు. అలాగే ఇంతకుముందు బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో వార్నర్‌ (66) పరుగులు చేసి ఔటయ్యాక ఆ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ రోజు వార్నర్‌.. హసరంగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరినప్పుడు గ్యాలరీలో అతడి కుమార్తెలు కంటతడి పెట్టిన చిత్రాలు వైరల్‌గా మారాయి. దీంతో తాను ఎక్కువ పరుగులు చేయాలని తన కుమార్తెలు ఆశపడుతున్నట్లు వార్నర్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌.. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాక వరుసగా మూడు అర్థ శతకాలతో దూసుకుపోతున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 63.67 సగటుతో 191 పరుగులు చేశాడు. అతడిలాగే రెచ్చిపోతే ఈ సీజన్‌లోనూ టాప్‌ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తాడు. మరోవైపు రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌ ఆరు మ్యాచ్‌ల్లో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలతో మొత్తం 375 పరుగులు సాధించాడు. అతడి సగటు 75గా నమోదైంది. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని