Diamond Duck: వీళ్లంతా డైమండ్‌ డక్‌ కెప్టెన్లు..

క్రికెట్‌లో డకౌట్‌ అంటే అందరికీ తెలిసిందే. ఎవరైనా బ్యాట్స్‌మన్‌ ఎన్ని బంతులాడినా పరుగులు చేయకుండా ఔటైతే డకౌట్‌ అంటారు. అలాగే గోల్డన్‌ డక్‌ అంటే ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరడం...

Published : 10 May 2022 02:10 IST

క్రికెట్‌లో డకౌట్‌ అంటే అందరికీ తెలిసిందే. ఎవరైనా బ్యాట్స్‌మన్‌ ఎన్ని బంతులాడినా పరుగులు చేయకుండా ఔటైతే డకౌట్‌ అంటారు. అలాగే గోల్డన్‌ డక్‌ అంటే ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరడం. కానీ, ఈ రెండూ కాకుండా డైమండ్‌ డక్‌ అనేది కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ఇలా డైమండ్‌ డక్‌కే ఔటయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా పెవిలియన్‌ చేరాడు. అలా ఈ భారత టీ20 లీగ్‌లో ఇప్పటివరకు డైమండ్‌ డక్‌గా వెనుదిరిగిన కెప్టెన్లు ఎవరంటే..


షేన్‌వార్న్‌ తొలిసారి..

(Photo: Shane Warne Instagram)

ఈ టీ20 లీగ్‌లో ఆరంభ సీజన్‌లోనే తొలి టైటిల్‌ కొట్టిన రాజస్థాన్‌ మాజీ కెప్టెన్, దివంగత స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ డైమండ్‌ డక్‌ రికార్డుల్లోనూ తన పేరునే ముందు లిఖించుకున్నాడు. 2009లో ముంబయితో జరిగిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో తొలిసారి అతడు ఈ అనవసరపు రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో జయసూర్య బౌలింగ్‌ చేయగా జోహన్‌ బోథా ఆఖరి బంతికి క్రీజులో ఉన్నాడు. అంతకుముందే మైదానంలోకి వచ్చిన వార్న్‌ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలుచున్నాడు. అయితే, ఆ చివరి బంతిని బోథా లాంగాన్‌లోకి పంపి సింగిల్‌ తీశాడు. అప్పుడు వార్న్‌ రెండో పరుగుకోసం యత్నించగా హర్భజన్‌ వేసిన త్రోకు రనౌటయ్యాడు. దీంతో తొలిసారి ఈ టోర్నీలో డైమండ్‌ డకౌటైన ఆటగాడిగా షేన్‌వార్న్‌ నిలిచాడు.


రెండోసారి కూడా..

(Photo: Shane Warne Instagram)

ఇక మరుసటి ఏడాదే రెండోసారి కూడా ఈ టోర్నీలో డైమండ్‌ డక్‌ అయిన కెప్టెన్‌గా షేన్‌వార్న్‌ మరో ప్రత్యేకత సాధించాడు. ఈసారి చెన్నైతో ఆడిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో ఔటవ్వడం గమనార్హం. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లోనే బరిలోకి వచ్చిన అతడు 19.4 ఓవర్‌కు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్నాడు. అప్పుడు తులాన్‌ తుషార వేసిన బంతికి సుమిత్‌ నర్వాల్‌ డీప్‌ పాయింట్ దిశగా షాట్‌ ఆడి సింగిల్‌ తీశాడు. అయితే, వార్న్‌ అనవసరంగా రెండో పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. అలా వరుసగా రెండో ఏడాది కూడా ఒక్క బంతిని ఎదుర్కోకుండానే పెవిలియన్‌ చేరాడు.


గంభీర్‌ స్వయంకృతం..

(Photo: Gautam Gambhir Instagram)

ఈ జాబితాలో రెండో కెప్టెన్‌గా గౌతమ్‌ గంభీర్‌ నిలిచాడు. 2013లో దిల్లీతో ఆడిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో అతడు ఇలాగే ఒక్క బంతినీ ఎదుర్కోకుండా పెవిలియన్‌ చేరాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌ చేయగా.. మన్విందర్‌ బిస్లా రెండో బంతిని స్ట్రైట్‌డ్రైవ్‌ ఆడాడు. అది వెళ్లి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న గంభీర్‌ ప్యాడ్లకు తగలడంతో అతడు సింగిల్‌ కోసం పరుగెత్తాడు. దీంతో వెంటనే బంతి అందుకున్న ఇర్ఫాన్‌ నేరుగా కీపర్‌వైపు విసిరాడు. అది వికెట్లకు తాకడంతో గంభీర్‌ రనౌటవ్వక తప్పలేదు.


మోర్గాన్‌ దురదృష్టం..

(Photo: Eoin Morgan Instagram)

ఇక 2013 తర్వాత మళ్లీ ఇలా డైమండ్‌ డక్‌గా ఔటైన మూడో కెప్టెన్‌గా ఇయాన్‌ మోర్గాన్‌ నిలిచాడు. గతేడాది అతడు కోల్‌కతా సారథిగా ఉండగా రాజస్థాన్‌తో జరిగిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో ఒక్క బంతిని ఎదుర్కోకుండానే ఔటయ్యాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ 10.2 ఓవర్‌కు మోరిస్‌ బౌలింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి స్ట్రైట్‌డ్రైవ్‌ ఆడాడు. ఆ బంతి నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లోని వికెట్లకు తాకగా.. అప్పటికే మోర్గాన్‌ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. అది ఔట్‌ కాకపోయినా.. అక్కడే ఉన్న మోరిస్‌ మళ్లీ బంతిని అందుకొని నాన్‌స్ట్రైకింగ్‌లోనే వికెట్లను తాకాడు. దీంతో మోర్గాన్‌ రనౌట్‌ రూపంలో ఒక్క బంతి ఆడకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది.


ఈసారి రాహుల్‌ కూడా..

(Photo: KL Rahul Instagram)

ఈ సీజన్‌లో తొలిసారి డైమండ్‌ డక్ అయిన తొలి కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో సారథిగా కేఎల్ రాహుల్‌ నిలిచాడు. కోల్‌కతాతో శనివారం ఆడిన మ్యాచ్‌లో ఈ లఖ్‌నవూ సారథి ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్‌ చేరాడు. లఖ్‌నవూ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సౌథీ బౌలింగ్‌లో ఓపెనర్‌ డికాక్‌ ఆడిన ఐదో బంతి షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌లోకి వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న వెంకటేశ్‌ అయ్యర్‌ వెంటనే బంతిని అందుకొని నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో వికెట్లకేసి విసిరాడు. అప్పటికే క్రీజువదిలి ముందుకు వచ్చిన రాహుల్‌ రనౌటయ్యాడు. దీంతో ఈ జాబితాలో అతడు కూడా చేరిపోయాడు.


కేన్‌ మామ ఇలాగే..

(Photo: Kane Williamson Instagram)

ఇక తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇలాగే ఔటయ్యాడు. దీంతో అతడు కూడా డైమండ్‌ డక్‌గా వెనుదిరిగిన ఐదో కెప్టెన్‌గా ఆ జాబితాలో చేరిపోయాడు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ తొలి బంతికే నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న కేన్‌ మామ ఔటయ్యాడు. మాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి బంతిని అభిషేక్‌ శర్మ కవర్స్‌లోకి ఆడగా.. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న షాబాజ్‌ అహ్మద్‌ బంతిని అందుకొని నేరుగా కీపర్‌వైపు వికెట్లకేసి విసిరాడు. దీంతో పరుగు కోసం యత్నించిన విలియమ్సన్‌ క్రీజులో బ్యాట్‌ పెట్టిన సమయానికి బంతి వికెట్లకు తాకింది. అయితే, అది అంపైర్‌ నిర్ణయం ప్రకారం ఔటివ్వడంతో విలియమ్సన్‌ కూడా డైమండ్‌ డక్‌ కెప్టెన్‌గా మిగిలిపోయాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని