Dinesh Karthik: ఇక్కడ లభించిన అభిమానం ఎక్కడా పొందలేదు: డీకే

గతంలో తాను ఎన్ని జట్లకు ప్రాతినిధ్యం వహించినా ఈసారి బెంగళూరు జట్టులో లభించినంత అభిమానం ఎక్కడా పొందలేదని ఆ జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ హర్షం వ్యక్తం చేశాడు...

Published : 29 May 2022 09:40 IST

(Photo: Dinesh Karthik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: గతంలో తాను ఎన్ని జట్లకు ప్రాతినిధ్యం వహించినా ఈసారి బెంగళూరు జట్టులో లభించినంత అభిమానం ఎక్కడా పొందలేదని ఆ జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ హర్షం వ్యక్తం చేశాడు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరి క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఆ జట్టు కప్పు కల నెరవేరకుండానే ఇంటిముఖం పట్టింది.

అయితే, ఈ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అభిమానులు తనపై చూపించిన ప్రేమకు రుణపడి ఉంటానని చెప్పాడు. బెంగళూరు విడుదల చేసిన వీడియోలో డీకే మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకు చాలా జట్లకు ఆడాను. కానీ ఈ జట్టుకు ఉన్నంత అభిమానగణాన్ని ఎక్కడా చూడలేదు. ఇక్కడ ఆడుతుంటే మైదానంలో అభిమానుల నుంచి వచ్చినంత మద్దతు ఎక్కడా పొందలేదు. మీ అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. మీలాంటి అభిమానుల అండ లేకపోతే నాలాంటి ఆటగాళ్లు ఈ వయసులో చేయాలనుకున్నది చేయలేరు’ అని భావోద్వేగానికి గురయ్యాడు.

‘మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా నాకు చాలా ప్రత్యేకం. మేం ఇలాంటి మెగా టోర్నీలు ఎన్ని ఆడినా మీ ముఖాలపై చిరునవ్వులు తెస్తేనే మాకు నిజమైన ఆనందం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. మీలాంటి అభిమానాన్ని సొంతం చేసుకున్న బెంగళూరు ఫ్రాంఛైజీతో ఆడటం నా అదృష్టం. మీరంతా నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం. అలాగే సామాజిక మాధ్యమాల్లో నాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. అయితే, ఈసారి మీ అంచనాలను అందుకోవడంలో త్రుటిలో విఫలమయ్యా. అదే కాస్త బాధగా ఉంది. కానీ, వచ్చే ఏడాది కచ్చితంగా మరింత కృషి చేయడానికి ప్రయత్నిస్తాం’ అని డీకే చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 330 పరుగులు చేశాడు. 55 సగటుతో 183.33 స్ట్రైక్‌రేట్‌తో బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని