Sanju Samson: బీసీసీఐ.. సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠి ఏం చేశారు?

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా జూన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది....

Updated : 23 May 2022 12:54 IST

టీమ్‌ఇండియా ఎంపికపై అభిమానుల ఫైర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా జూన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్‌ ఆడనుంది. అందుకోసం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటి ఆదివారం 18 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 టీమ్‌ జాబితాను విడుదల చేసింది. అందులో ఈ సీజన్‌లో అంత గొప్పగా రాణించని రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయగా.. వారికన్నా మెరుగైన స్ట్రైక్‌రేట్‌ కలిగిన సంజూ శాంసన్‌, రాహుల్‌ త్రిపాఠిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వీరిద్దర్ని ఏ లెక్కన ఎంపిక చేయలేదని అభిమానులు బీసీసీఐని నిలదీస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐని ఎండగడుతూ సంజూ, రాహల్‌ త్రిపాఠిల ఆటను మెచ్చుకుంటున్నారు.

కాగా, ఈ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ 14 మ్యాచ్‌ల్లో 418 పరుగులు చేయగా అందులో 3 అర్ధశతకాలు సాధించాడు. సగటు 32.15, స్ట్రైక్‌రేట్‌ 120.11గా నమోదయ్యాయి. రుతురాజ్‌ 14 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు. 3 అర్ధ శతకాలే సాధించాడు. సగటు 26.29 కాగా, స్ట్రైక్‌రేట్‌ 126.46గా ఉంది. వెంకటేశ్‌ అయ్యర్‌ మరీ ఘోరంగా 12 మ్యాచ్‌ల్లో 182 పరుగులే చేశాడు. ఒకటే అర్ధశతకం సాధించాడు. 16.55 సగటు, 107.69 స్ట్రైక్‌రేట్‌తో పేలవంగా ఉన్నాడు. మరోవైపు రాహుల్ త్రిపాఠి.. 14 మ్యాచ్‌ల్లో 413 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధశతకాలు కొట్టాడు. మెరుగైన 41.30 సగటు, స్ట్రైక్‌రేట్‌ 158.23 సాధించాడు. ఇక సంజూ శాంసన్‌ 14 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలు సాధించాడు. సగటు 28.77 నామమాత్రంగా ఉన్నా స్ట్రైక్‌రేట్‌ 147.24 గొప్పగా ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ ఎంపిక చేయకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌4లో నిలిచిన శిఖర్‌ ధావన్‌ను కూడా ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని