Hardik Pandya: హార్దిక్‌ ఇది మంచిది కాదు.. షమి మీద అరవడంపై నెటిజన్ల ఆగ్రహం

గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు సీనియర్‌ ప్లేయర్‌ మహ్మద్‌ షమిపై చిందులు తొక్కడంతో ట్విటర్‌లో మండిపడుతున్నారు...

Updated : 12 Apr 2022 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు సీనియర్‌ ప్లేయర్‌ మహ్మద్‌ షమిపై చిందులు తొక్కాడు. గుజరాత్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 19.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (57; 46 బంతుల్లో 2x4, 4x6) అర్ధ శతకంతో మెరిశాడు.

అయితే, హార్దిక్‌ పాండ్య వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ త్రిపాఠి (17 రిటైర్డ్‌ హర్ట్‌; 11 బంతుల్లో 1x4, 1x6) ఆడిన భారీ షాట్‌ను డీప్‌ థర్డ్‌ మ్యాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న షమి క్యాచ్‌ అందుకోలేకపోయాడు. అప్పటికే తన ఓవర్‌లో విలియమ్సన్‌ రెండు సిక్సర్లు బాదడంతో గుర్రుగా ఉన్న పాండ్య.. షమి ఆ బంతిని అందుకోకపోవడంతో గట్టిగా అరిచాడు. అది టీవీలో స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు వెంటనే పాండ్యపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. షమి లాంటి సీనియర్‌ ఆటగాళ్లను గౌరవించాలని అన్నారు. ఇలాగే అతిగా ప్రవర్తిస్తే గుజరాత్‌ జట్టులో ఎవరూ ఉండరని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్‌ టీమ్‌లో ఆటగాళ్లు పలు క్యాచ్‌లు వదిలినా విలియమ్సన్‌ ఎలా వ్యవహరించాడో ఒకసారి చూడాలని హితవు పలికారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు హార్దిక్‌పై అసహనం ప్రదర్శిస్తున్నారు.

మరోవైపు ఇదే మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ 42 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోవడంపైనా అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ టీ20 లీగ్‌ చరిత్రలోనే హార్దిక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేయడానికి ఇన్ని బంతులు తీసుకోవడం ఇదే తొలిసారి. దీంతో అతడు నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాలని సూచిస్తున్నారు. అభినవ్‌ మనోహర్‌ నాలుగో స్థానంలో రావాలని కోరుతున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి.. ధోనీ నుంచి స్ఫూర్తి పొందావా అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

అత్యధిక బంతుల్లో హార్దిక్‌  హాఫ్‌ సెంచరీలు..

* 42 బంతుల్లో హైదరాబాద్‌పై (ఈ మ్యాచ్‌లోనే)

* 2018లో బెంగళూరుపై 41 బంతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని