ప్చ్‌.. అంపైరాంగ్‌!

క్రికెట్‌ మ్యాచ్‌లో అంపైరింగ్‌ అంత తేలికైన పని కాదు. ప్రతి బంతినీ తీక్షణంగా గమనించి, కచ్చితమైన నిర్ణయాలు వెలువరించడం సామాన్యమైన విషయం కాదు. ఎలాంటి టోర్నీలో అయినా, ఎంత పెద్ద మ్యాచ్‌లో అయినా, అంపైరింగ్‌

Updated : 04 May 2022 09:15 IST

క్రికెట్‌ మ్యాచ్‌లో అంపైరింగ్‌ అంత తేలికైన పని కాదు. ప్రతి బంతినీ తీక్షణంగా గమనించి, కచ్చితమైన నిర్ణయాలు వెలువరించడం సామాన్యమైన విషయం కాదు. ఎలాంటి టోర్నీలో అయినా, ఎంత పెద్ద మ్యాచ్‌లో అయినా, అంపైరింగ్‌ చేస్తున్నది ఎవరైనా.. కొన్ని తప్పిదాలు చోటు చేసుకోవడం సహజం! కానీ ఈసారి  టీ20 లీగ్‌లో అంపైరింగ్‌ టోర్నీ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గట్లుగా లేదు. దారుణమైన తప్పిదాలు జరుగుతుండటం, దాని వల్ల ఫలితాలే మారిపోతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓవైపు ఆటగాళ్లు.. ఇంకోవైపు అభిమానులు.. మరోవైపు మాజీలు, విశ్లేషకులు.. అంపైరింగ్‌ విషయమై గగ్గోలు పెడుతున్నా అంతకంతకూ తప్పిదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు.

* రాజస్థాన్‌-దిల్లీ మ్యాచ్‌లో ‘నోబాల్‌’ గొడవ ఎంత వరకు వెళ్లిందో అంతా చూశారు. దిల్లీ బ్యాట్స్‌మన్‌ రోమన్‌ పావెల్‌కు రాజస్థాన్‌ బౌలర్‌ మెకాయ్‌ వేసిన బంతి నడుం కంటే ఎత్తులో వచ్చింది. అది నోబాల్‌ అనడంలో సందేహమే లేదు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ కానీ, స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ కానీ ఏమీ స్పందించలేదు. దీనిపై దిల్లీ  బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీ కెప్టెన్‌ పంత్‌ అయితే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి వచ్చేయమన్నాడు. ఇందుకుగాను అతను జరిమానా కూడా ఎదుర్కొన్నాడు. పంత్‌ ప్రవర్తన ఆక్షేపణీయమే అయినా.. అంపైర్‌ నోబాల్‌ ఇవ్వకపోవడం దిల్లీకి పెద్ద దెబ్బే. అది నోబాల్‌ అయితే ఆ జట్టు మ్యాచ్‌ గెలిచే అవకాశాలుండేవేమో. అంపైర్‌ నిర్ణయం రాజస్థాన్‌కు కలిసొచ్చి మ్యాచ్‌ నెగ్గింది.

* బెంగళూరుతో మ్యాచ్‌లో లఖ్‌నవూ ఛేదనలో స్టాయినిస్‌ మంచి ఊపులో ఉండగా.. హేజిల్‌వుడ్‌ ఆఫ్‌స్టంప్‌కు బాగా దూరంగా బంతి విసిరాడు. స్టాయినిస్‌ బ్యాట్‌ను చాచినా అందలేదు. అది కచ్చితంగా వైడ్‌ ఇవ్వాల్సిన బంతి. కానీ అంపైర్‌ స్పందించలేదు. దీనిపై స్టాయినిస్‌ ఆగ్రహంతో అంపైర్‌తో వాదించాడు. ఈ క్రమంలో అతడి ఏకాగ్రత చెదిరింది. తర్వాతి బంతికే ఔటై వెనుదిరిగాడు

* ఒక మ్యాచ్‌లో బెంగళూరు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ను అంపైర్‌ ఎల్బీగా ప్రకటించాడు. అతను క్షణం ఆలస్యం చేయకుండా సమీక్ష కోరాడు. బంతి నేరుగా బ్యాట్‌కే తగిలిందని, బ్యాట్‌ను తాకాక వెనక్కే వెళ్లలేదని తేలింది. రీప్లే చూసిన వాళ్లంతా అంపైర్‌ అసలెలా ఎల్బీ ఇచ్చాడో అర్థం కాలేదు.
* ముంబయితో మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లిని అంపైర్‌ ఎల్బీగా ప్రకటించగా.. బంతి ఒకేసారి బ్యాట్‌కు, ప్యాడ్‌కు తాకిందని తేలింది. ఇలాంటపుడు సంశయ లబ్ది కింద కోహ్లిని నాటౌట్‌గా ప్రకటిస్తారని భావించగా..  మూడో అంపైర్‌ ఔట్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది.
* దిల్లీతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో కోల్‌కతా ఓపెనర్‌ అజింక్య రహానెను మ్యాచ్‌ అంపైర్‌ వరుసగా రెండు బంతులకు ఎల్బీ ఇచ్చాడు. రెండుసార్లూ రహానె సమీక్షకు వెళ్లగా.. నిర్ణయం నాటౌట్‌గా వచ్చింది.   ఈ  టీ20 లీగ్‌లో ఇలా అంపైర్లు ఎల్బీడబ్ల్యూ ప్రకటించడం.. సమీక్షలో    అవి నిలవకపోవడం.. నిర్ణయాన్ని మార్చడం లెక్కలేనన్నిసార్లు జరిగాయి. ప్రతి  టీ20 లీగ్‌లోనూ ఇలాంటివి ఉంటాయి కానీ.. ఈసారి సంఖ్య మరీ ఎక్కువగా ఉండడం చర్చనీయాంశమవుతోంది.

* ఈ  టీ20 లీగ్‌లో కొన్ని క్యాచ్‌ల విషయంలోనూ వివాదాలు తప్పలేదు. ఓ మ్యాచ్‌లో హైదరాబాద్‌  కెప్టెన్‌ విలియమ్సన్‌ ఇచ్చిన క్యాచ్‌ను రాజస్థాన్‌ ఆటగాడు పడిక్కల్‌ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు రీప్లేలో కనిపించింది. కానీ థర్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. దిల్లీతో మ్యాచ్‌లో వార్నర్‌ క్యాచ్‌ను లఖ్‌నవూ ఆటగాడు బదోని అందుకున్న తీరు ఇలాగే సందేహాలు రేకెత్తించింది.

‘‘టీ20 లీగ్‌ అంపైరింగ్‌లో ఏం జరుగుతోంది? పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. చిన్న తప్పిదాలే కొన్నిసార్లు పెద్ద మలుపులకు కారణమవుతాయి. దయచేసి మేల్కోండి. సమర్థులను పెట్టండి’’

- క్రిస్‌ శ్రీకాంత్‌, మాజీ క్రికెటర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని