David Warner: వార్నర్‌ ధనాధన్‌.. చెలరేగిన పావెల్‌

ప్చ్‌..హైదరాబాద్‌ ! పేలవంగా ఆరంభించినా వరుసగా అయిదు విజయాలతో దూసుకెళ్లిన ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. దిల్లీ మురిసింది. వార్నర్‌, పావెల్‌ చెలరేగిన వేళ.. ఆ జట్టు హైదరాబాద్‌ను ఓడించింది. అయితే కొండంత స్కోరు చేసినా, ఛేదనలో ప్రత్యర్థిని 9 ఓవర్లలో 48/3కు పరిమితం చేసి అలవోకగా గెలవగలిగే స్థితిలో నిలిచినా..

Updated : 06 May 2022 06:56 IST

హైదరాబాద్‌పై దిల్లీ విజయం

పూరన్‌ మెరుపులు వృథా

ప్చ్‌..హైదరాబాద్‌ ! పేలవంగా ఆరంభించినా వరుసగా అయిదు విజయాలతో దూసుకెళ్లిన ఆ జట్టు.. ఇప్పుడు వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. దిల్లీ మురిసింది. వార్నర్‌, పావెల్‌ చెలరేగిన వేళ.. ఆ జట్టు హైదరాబాద్‌ను ఓడించింది. అయితే కొండంత స్కోరు చేసినా, ఛేదనలో ప్రత్యర్థిని 9 ఓవర్లలో 48/3కు పరిమితం చేసి అలవోకగా గెలవగలిగే స్థితిలో నిలిచినా.. పూరన్‌ విధ్వంసక బ్యాటింగ్‌ వల్ల దిల్లీకి కంగారు తప్పలేదు. పది మ్యాచ్‌ల్లో అయిదో విజయం సాధించిన దిల్లీ.. ప్లేఆఫ్స్‌ రేసులో మరీ వెనకబడకుండా చూసుకుంది.

ముంబయి

దిల్లీ మెరిసింది. వార్నర్‌ (92 నాటౌట్‌; 58 బంతుల్లో 12×4, 3×6), రోమన్‌ పావెల్‌ (67 నాటౌట్‌; 35 బంతుల్లో 3×4, 6×6) చెలరేగడంతో గురువారం 21 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. వార్నర్‌, పావెల్‌ విధ్వంసంతో మొదట దిల్లీ 3 వికెట్లకు 207 పరుగులు సాధించింది. ఛేదనలో తడబడ్డ హైదరాబాద్‌ 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. తేలిగ్గా ఓడిపోయేలా కనిపించిన  హైదరాబాద్‌. పూరన్‌ (62; 34 బంతుల్లో 2×4, 6×6) విధ్వంసంతో గట్టిగా ప్రతిఘటించింది. మార్‌క్రమ్‌ (42; 25 బంతుల్లో 4×4, 3×6) కూడా మెరిశాడు. ఖలీల్‌ అహ్మద్‌ (3/35) బంతితో రాణించాడు.

పోరాడిన పూరన్‌: భారీ లక్ష్య ఛేదనలో మెరుపు ఆరంభం అవసరంగా కాగా.. చాలా పేలవంగా మొదలెట్టింది హైదరాబాద్‌ 9 ఓవర్లలో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి బాగా వెనుకబడి పోయింది. దిల్లీ బౌలర్లు.. బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేశారు. నోకియా, మిచెల్‌ మార్ష్‌, ఖలీల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. రెండో ఓవర్లో అభిషేక్‌ (7)ను ఔట్‌ చేసి ఖలీల్‌ వికెట్ల పతనాన్ని ఆరంభించగా.. విలియమ్సన్‌ (4)ను నోకియా, రాహుల్‌ త్రిపాఠి (22)ని మార్ష్‌ వెనక్కి పంపాడు. అయితే పూరన్‌, మార్‌క్రమ్‌ హైదరాబాద్‌ పూర్తిగా ఆశలు కోల్పోకుండా చూశారు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 13వ ఓవర్లో మార్‌క్రమ్‌ను ఖలీల్‌ ఔట్‌ చేసేప్పటికి స్కోరు 97. అప్పటికి సాధించాల్సిన రన్‌రేట్‌ చాలా ఎక్కువే. కానీ పూరన్‌ సిక్స్‌ల మోత కొనసాగించడంతో దిల్లీ పూర్తి ధీమాతో ఉండలేని పరిస్థితి. ఆందోళన తప్పలేదు. 15వ ఓవర్లో శశాంక్‌ సింగ్‌ను శార్దూల్‌ ఔట్‌ చేసినా.. పూరన్‌ జోరు కొనసాగించాడు. చివరి నాలుగు ఓవర్లలో హైదరాబాద్‌కు 62 పరుగులు అవసరమయ్యాయి. అయితే 17వ ఓవర్లో మెరుగ్గా బౌలింగ్‌ చేసిన ఖలీల్‌ ఏడు పరుగులే ఇచ్చి అబాట్‌ను ఔట్‌ చేశాడు. పూరన్‌ దూకుడుగా ఉన్న నేపథ్యంలో చివరి మూడు ఓవర్లలో 55 పరుగులు చేయాల్సిన స్థితిలోనూహైదరాబాద్‌ ఆశలతోనే ఉంది. అయితే శార్దూల్‌ గతి తప్పి బౌలింగ్‌ చేయడంతో 18వ ఓవర్లో  ఓ ఫోర్‌, సిక్స్‌ బాదిన పూరన్‌.. ఓ ఫుల్‌ టాస్‌కు క్యాచ్‌ ఔట్‌ కావడంతో దిల్లీ ఊపిరిపీల్చుకుంది. 19వ ఓవర్లో గోపాల్‌, కార్తీక్‌ త్యాగి 16 పరుగులు రాబట్టినా.. చివరి ఓవర్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో హైదరాబాద్‌  ఓటమి ఖాయమైపోయింది.

వార్నర్‌ దంచేశాడు: దిల్లీ ఇన్నింగ్స్‌లో వార్నర్‌ ఆటే హైలైట్‌. ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన ఈ ఓపెనర్‌.. హైదరాబాద్‌  బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మెరుపు బ్యాటింగ్‌తో తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పావెల్‌దీ విలువైన ఇన్నింగ్సే. ధనాధన్‌ ఆటతో అతడు బౌలర్లను హడలెత్తించాడు. వార్నర్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను తన భుజాలపై మోస్తే.. పావెల్‌ మెరుపు ముగింపునిచ్చాడు. ఒక్క భువనేశ్వర్‌ తప్ప ఏ హైదరాబాద్‌  బౌలరూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయాడు.

మరో ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ ఖాతా అయినా తెరవకపోయినా.. మిచెల్‌ మార్ష్‌ (10) త్వరగానే నిష్క్రమించినా వార్నర్‌.. బ్యాట్‌ ఝుళిపించడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి 50/2తో నిలిచింది దిల్లీ. వార్నర్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా నాలుగో ఓవర్‌ నుంచి దూకుడు పెంచాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ దంచాడు. కార్తీక్‌ త్యాగి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లను బౌండరీ దాటించాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా సింగిల్స్‌ తీస్తూ, అడపాదడపా బౌండరీలు కొడుతూ సాగిపోయాడు. పంత్‌ కాసేపే ఉన్నా.. చెలరేగిపోయాడు. గోపాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4తో విధ్వంసం సృష్టించాడు. కానీ ఆ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అలవోకగా బ్యాటింగ్‌ చేస్తున్న వార్నర్‌కు రోమన్‌ పావెల్‌ సహకరించడంతో 15 ఓవర్లలో 137/3తో నిలిచిన దిల్లీ.. పెద్ద స్కోరుపై కన్నేసింది. అఖరి అయిదు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు పిండుకుని ప్రత్యర్థి కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో సింహభాగం స్కోరు పావెల్‌దే. గేర్‌ మార్చిన అతడు ఆఖర్లో భారీ షాట్లతో హైదరాబాద్‌ బౌలింగ్‌ తుత్తునియలు చేశాడు. భువి బౌలింగ్‌లో ఓ సిక్స్‌ కొట్టిన అతడు.. అబాట్‌ బౌలింగ్‌లో రెండు, త్యాగి ఓవర్లో మరో సిక్స్‌ దంచేశాడు. ముఖ్యంగా ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో రెచ్చిపోయి ఆడాడు. ఓ సిక్స్‌, మూడు ఫోర్లతో 19 పరుగులు రాబట్టాడు. దూకుడు మీదున్న వార్నర్‌ సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే 19వ ఓవర్లో (భువనేశ్వర్‌) మూడు ఫోర్లతో 92కు చే రుకున్న అతడికి.. పావెల్‌ విధ్వంసం కారణంగా చివరి ఓవర్లో ఒక్క బంతి ఆడే అవకాశం కూడా రాలేదు. అయినా సంతోషంగానే పెవిలియన్‌ బాట పట్టాడు. టాస్‌ గెలిచి ఫీల్టింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌కు చింతించక తప్పలేదు. వార్నర్‌, పావెల్‌ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని