Lucknow: లఖ్‌నవూ పంజా

మెగా టోర్నీలో కొత్త జట్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే గుజరాత్‌  8 విజయాలతో దాదాపుగా ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. లఖ్‌నవూ సైతం 8వ విజయం సాధించింది. శనివారం బ్యాటుతో చెలరేగి, బంతితో విజృంభించిన ఆ జట్టు.. కోల్‌కతాను చిత్తు చేసి ప్లేఆఫ్స్‌ దిశగా అడుగులేసింది. ఏడో పరాజయంతో కోల్‌కతా  తన అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.

Updated : 08 May 2022 06:44 IST

కోల్‌కతాపై 75 పరుగుల విజయం
8వ విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరువ
మెరిసిన డికాక్‌, హుడా
విజృంభించిన అవేష్‌, హోల్డర్‌

మెగా టోర్నీలో కొత్త జట్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే గుజరాత్‌  8 విజయాలతో దాదాపుగా ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. లఖ్‌నవూ సైతం 8వ విజయం సాధించింది. శనివారం బ్యాటుతో చెలరేగి, బంతితో విజృంభించిన ఆ జట్టు.. కోల్‌కతాను చిత్తు చేసి ప్లేఆఫ్స్‌ దిశగా అడుగులేసింది. ఏడో పరాజయంతో కోల్‌కతా  తన అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.

పుణె

లఖ్‌నవూ ఆల్‌రౌండ్‌ జోరు ముందు కోల్‌కతా నిలవలేకపోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రాహుల్‌ సేన 75 పరుగుల భారీ తేడాతో శ్రేయస్‌ జట్టును చిత్తు చేసింది. మొదట క్వింటన్‌ డికాక్‌ (50; 29 బంతుల్లో 4×4, 3×6), దీపక్‌ హుడా (41; 27 బంతుల్లో 4×4, 2×6), స్టాయినిస్‌ (28; 14 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో లఖ్‌నవూ  7 వికెట్లకు 176 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ (2/22) ఆకట్టుకున్నాడు. అనంతరం ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవేష్‌ ఖాన్‌ (3/19), హోల్డర్‌ (3/31), మోసిన్‌ ఖాన్‌ (1/6)ల ధాటికి కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లోనూ రసెల్‌ (45; 19 బంతుల్లో 3×4, 5×6) మాత్రమే సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లు తేలిపోయారు.

ఒక్కడు మినహా..: కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదిస్తుందన్న ఆశ ఏ దశలోనూ కలగలేదు. అంత పేలవంగా సాగింది ఆ జట్టు బ్యాటింగ్‌. కోల్‌కతా ఓటమి చాలా ముందుగానే ఖరారైపోయింది. తొలి ఓవర్లో మోసిన్‌ ఖాన్‌ మెయిడెన్‌ వికెట్‌ (ఇంద్రజిత్‌)తో కోల్‌కతాను దెబ్బ కొట్టాడు. తర్వాత చమీర (1/14).. శ్రేయస్‌ (6)ను ఔట్‌ చేయడం కోల్‌కతాకు షాక్‌. ఎప్పుడెప్పుడు ఔటవుదామా అన్నట్లు ఆడిన ఫించ్‌ (14).. హోల్డర్‌ బౌలింగ్‌లో పేలవ షాట్‌ ఆడి వెనుదిరిగాడు. ఫామ్‌లో ఉన్న నితీశ్‌ రాణా (2) క్రీజులో కుదురుకోవడానికి చాలా కష్టపడి.. చివరికి అవేష్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 7 ఓవర్లకు 25/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది   కోల్‌కతా. ఈ దశలో క్రీజులోకి అడుగు పెట్టిన రసెల్‌.. వచ్చీ రాగానే లఖ్‌నవూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. విధ్వంసక షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ ఏ క్షణమైనా ఔటైపోవచ్చు అన్నట్లే సాగింది అతడి బ్యాటింగ్‌. ఆ అంచనాకు తగ్గట్లే.. 13వ ఓవర్లో స్కోరు 85 వద్ద అవేష్‌ బౌలింగ్‌లో షాట్‌ గురి తప్పడంతో హోల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి అతను పెవిలియన్‌ చేరాడు. చివరి 5 వికెట్లను కేవలం 14 బంతుల తేడాలో కోల్పోయిన కోల్‌కతా ఇంకో 33 బంతులుండగానే ఇన్నింగ్స్‌ను ముగించింది. రసెల్‌ కాకుండా ఆ జట్టులో నరైన్‌ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.

మెరిసిన డికాక్‌, హుడా: టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలినా.. తట్టుకుని, మెరుగైన స్కోరే చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ రాహుల్‌ కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్‌ చేరిపోయాడు. నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న అతను పరుగు కోసం ముందుకెళ్లి, వెనక్కి తిరిగి క్రీజును చేరుకునే లోపు శ్రేయస్‌ మెరుపు త్రోతో రనౌట్‌ చేసేశాడు. లఖ్‌నవూ బ్యాటింగ్‌ మూల స్తంభం అయిన రాహుల్‌ అలా వెనుదిరిగినా.. ఆ ప్రభావం జట్టుపై పడనివ్వలేదు డికాక్‌, దీపక్‌ హుడా. ఇద్దరూ భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డికాక్‌ 7వ ఓవర్లోనే,  27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయడం విశేషం. అతను నరైన్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఔటైపోయినా.. కృనాల్‌ (25) సహకారంతో హుడా దూకుడు కొనసాగించడంతో 11 ఓవర్లకే లఖ్‌నవూ స్కోరు 100కు చేరుకుంది. ఈ దశలో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి స్కోరు వేగానికి కళ్లెం వేశారు. హుడా, కృనాల్‌లను రసెల్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. 18 ఓవర్లకు స్కోరు 142/4. కానీ మావి వేసిన 19 ఓవర్లో సిక్సర్ల మోత మోగిపోయింది. తొలి మూడు బంతులకు మూడు సిక్సర్లు బాదిన స్టాయినిస్‌ నాలుగో బంతికి ఔట్‌ కాగా.. చివరి రెండు బంతులను హోల్డర్‌ స్టాండ్స్‌లో పడేశాడు. ఈ ఓవర్లో 30 పరుగులొచ్చాయి. అయితే చివరి ఓవర్లో సౌథీ 4 పరుగులే ఇచ్చి లఖ్‌నవూకు కళ్లెం వేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని