Kolkata vs Mumbai: కోల్‌కతా వదల్లేదు.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం

ప్లేఆఫ్‌ అవకాశాలు అంతంతమాత్రమే. అలాగని దారులు మూసుకుపోలేదు. నెట్‌ రన్‌రేట్‌ మెరుగుపరుచుకుని ఏడు విజయాలతో ముందంజ వేసేందుకు చిన్న అవకాశముంది. ఆ ఆశతోనే కోల్‌కతా ముందుకు సాగుతోంది. ఆ జట్టు సోమవారం ముంబయిను ఓడించింది. ఫామ్‌ అందుకున్న బుమ్రా సంచలన బౌలింగ్‌తో భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేసినా..   కోల్‌కతా చక్కటి బౌలింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌తో ముంబయికి షాకిచ్చింది. ప్రత్యర్థి ముందు 166 పరుగుల లక్ష్యాన్నే నిలిపినప్పటికీ.. ఆ జట్టు 52 పరుగుల

Updated : 10 May 2022 06:45 IST

మెరిసిన వెంకటేశ్‌, నితీశ్‌, కమిన్స్‌
ముంబయికి తప్పని ఓటమి
ముంబయి

ప్లేఆఫ్‌ అవకాశాలు అంతంతమాత్రమే. అలాగని దారులు మూసుకుపోలేదు. నెట్‌ రన్‌రేట్‌ మెరుగుపరుచుకుని ఏడు విజయాలతో ముందంజ వేసేందుకు చిన్న అవకాశముంది. ఆ ఆశతోనే కోల్‌కతా ముందుకు సాగుతోంది. ఆ జట్టు సోమవారం ముంబయిని ఓడించింది. ఫామ్‌ అందుకున్న బుమ్రా సంచలన బౌలింగ్‌తో భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేసినా.. కోల్‌కతా చక్కటి బౌలింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌తో ముంబయికి షాకిచ్చింది. ప్రత్యర్థి ముందు 166 పరుగుల లక్ష్యాన్నే నిలిపినప్పటికీ.. ఆ జట్టు 52 పరుగుల తేడాతో నెగ్గడం విశేషం.

క మ్యాచ్‌ ఓడితే ప్లేఆఫ్స్‌ తలుపులు మూసుకుపోయే స్థితిలో కోల్‌కతా సత్తా చాటింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ముంబయిని చిత్తు చేసింది. మొదట కోల్‌కతా 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (43; 24 బంతుల్లో 3×4, 4×6), నితీశ్‌ రాణా (43; 26 బంతుల్లో 3×4, 4×6)ల జోరుతో 200 చేసేలా కనిపించిన కోల్‌కతాకు బుమ్రా (5/10) సంచలన బౌలింగ్‌తో కళ్లెం వేశాడు. అనంతరం కమిన్స్‌ (3/22), రసెల్‌ (2/22) సహా కోల్‌కతా బౌలర్లందరూ రాణించడంతో ముంబయి 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. కిషన్‌ (51; 43 బంతుల్లో 5×4, 1×6) మినహా బ్యాటర్లు తేలిపోయారు. వరుసగా 8 ఓటములతో ముందే ప్లేఆఫ్స్‌కు దూరమై, గత రెండు మ్యాచ్‌లు నెగ్గిన ముంబయి.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. 12 మ్యాచ్‌ల్లో కోల్‌కతాకిది అయిదో విజయం. ముంబయి ఓడినా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ బుమ్రాకే దక్కింది.

టపటపా..: లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా.. బ్యాట్స్‌మెన్‌లో నిలిచి ఆడాలన్న తపనే కనిపించకపోవడంతో ముంబయి ఛేదనలో తుస్సుమనిపిచింది. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన రోహిత్‌ శర్మ (2).. సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కిషన్‌ ఓ ఎండ్‌లో నిలకడగా ఆడుతున్నా.. అతడికి ఏ బ్యాట్స్‌మన్‌ నుంచి సహకారం అందలేదు. ప్రతి ఒక్కరూ ఒకట్రెండు షాట్లు ఆడటం, అదే ఊపులో బంతిని గాల్లోకి లేపడం, క్యాచౌట్‌ కావడం.. ఇదీ వరస. ఒక్కరూ నిలబడి ఆడే ప్రయత్నమే చేయలేదు. తిలక్‌ (6), రమణ్‌దీప్‌ (12), డేవిడ్‌ (13) ఒకరి తర్వాత ఒకరు ఇలాగే వెనుదిరిగారు. 14 ఓవర్లకు ముంబయి స్కోరు 102/4 కాగా.. కమిన్స్‌ ఒకే ఓవర్లో కిషన్‌, సామ్స్‌ (1), మురుగన్‌ అశ్విన్‌ (0)లను ఔట్‌ చేయడంతో కోల్‌కతాను విజయానికి చేరువ చేశాడు. పొలార్డ్‌ (15) అద్భుతాలేమీ చేయలేదు. అతను రనౌటయ్యాడు. చివరి మూడు వికెట్లూ రనౌట్లే కావడం విశేషం.

బూమ్‌.. బూమ్‌.. బుమ్రా!: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. ఒక దశ వరకు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టుకు మెరుపు ఆరంభాన్నిస్తే.. అతను ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణా ఆ జోరును కొనసాగించాడు. వీరి ధాటికి ముంబయి బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 6వ ఓవర్లో వెంకటేశ్‌ ఔటయ్యేసరికే స్కోరు 60కి చేరుకుంది. అతడితో పాటు రహానె (25)ను పెవిలియన్‌ చేర్చిన స్పిన్నర్‌ కార్తికేయ (2/32).. తర్వాత రాణాకు లక్ష్యంగా మారాడు. మిగతా బౌలర్లనూ అతను వదిలి పెట్టలేదు. 13 ఓవర్లకు కోల్‌కతా 123/2తో తిరుగులేని స్థితికి చేరుకుంది. ఈ ఊపు చూస్తే ఆ జట్టు 200 చేసేలా కనిపించింది. కానీ ఇక్కడి నుంచి కథ మారిపోయింది. బుమ్రా ధాటికి కోల్‌కతా వరుసగా వికెట్లు కోల్పోయింది. ముందుగా కెప్టెన్‌ శ్రేయస్‌ (6)ను మురుగన్‌ అశ్విన్‌ ఔట్‌ చేయగా.. తర్వాత బుమ్రా మ్యాజిక్‌ మొదలైంది. అతను ఒకే ఓవర్లో రసెల్‌ (9), రాణాలను ఔట్‌ చేసి కోల్‌కతాను గట్టి దెబ్బ కొట్టాడు. అతను 18వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చి ఒక్క పరుగూ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టేశాడు. రింకు సింగ్‌ (23 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 1×6) పోరాడటంతో కోల్‌కతా ఓ మోస్తరు స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది.


బుమ్రా 4-1-10-5

ముంబయి ప్లేఆఫ్స్‌ అవకాశాలకు ఎప్పుడో తెరపడింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా కోల్‌కతా ముందంజ వేయడం కష్టమే! ఈ నేపథ్యంలో అంతగా ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్‌లో భారత అభిమానులను అమితానందానికి గురి చేసిన విషయం.. బుమ్రా పూర్వపు ఫామ్‌ను అందుకోవడమే. ప్రతి టీ20 లీగ్‌లోనూ ఎక్కువ వికెట్లు పడగొట్టే బౌలర్లలో ఒకడిగా కనిపించే బుమ్రా.. ఈసారి ఇప్పటిదాకా పేలవ ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం అయిదే వికెట్లు తీశాడు. బుమ్రా  టీ20లీగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంత పేలవ ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. ఈ ప్రదర్శన టీమ్‌ఇండియాను, భారత అభిమానులనూ కలవరపెట్టేదే. మూడు ఫార్మాట్లలో ప్రధాన బౌలరైన బుమ్రా ఇలా అయిపోయాడేంటని అంతా కంగారు పడ్డారు. అయితే సోమవారం అతను ఒక్కసారిగా విజృంభించాడు. ఆరంభం నుంచి ఎంతో కట్టుదిట్టంగా బంతులేస్తూ ఆకట్టుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌ మ్యాచ్‌కే హైలైట్‌. వేగం, బౌన్స్‌ కలగలిపి ప్రతి బంతినీ ఓ బుల్లెట్‌లా సంధించిన బుమ్రా.. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మీదికి దూసుకొచ్చిన బంతులకు షాట్లు ఆడపోయి 1, 3, 4 బంతులకు జాక్సన్‌, కమిన్స్‌, నరైన్‌ క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగారు. ముఖ్యంగా నరైన్‌కు సంధించిన బంతికైతే ఎవరైనా వికెట్‌ ఇచ్చేయాల్సిందే. ఆ తర్వాతి బంతికి హ్యాట్రిక్‌ అవకాశం వచ్చింది బుమ్రాకు. తనదైన శైలిలో కాళ్ల మీదికి యార్కర్‌ సంధించాడతను. అయితే సౌథీ సమర్థంగా దాన్ని అడ్డుకుని హ్యాట్రిక్‌ కాకుండా చేశాడు. ఈ ఓవర్లో పరుగే ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు బుమ్రా. మొత్తంగా అతను 4 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. మొత్తానికి బుమ్రా మళ్లీ లయ అందుకోవడం భారత జట్టుకు శుభ సూచకమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని