Gujarat vs Rajasthan: కొత్తా.. పాతా?

ఉత్కంఠ వీడింది. ప్లేఆఫ్స్‌ రేసు ముగిసింది. టాప్‌-4 జట్లేవో తేలిపోయాయి. మధ్యలో ఒక్క రోజే విరామం. ఉత్కంఠను, వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే  టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ దశకు రంగం సిద్ధమైంది. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ 

Updated : 24 May 2022 06:53 IST

గుజరాత్‌తో రాజస్థాన్‌ ఢీ
టీ20 లీగ్‌లో తొలి క్వాలిఫయర్‌ నేడే
రాత్రి 7.30 నుంచి

ఉత్కంఠ వీడింది. ప్లేఆఫ్స్‌ రేసు ముగిసింది. టాప్‌-4 జట్లేవో తేలిపోయాయి. మధ్యలో ఒక్క రోజే విరామం. ఉత్కంఠను, వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే  టీ20 లీగ్‌ ప్లేఆఫ్స్‌ దశకు రంగం సిద్ధమైంది. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌  క్వాలిఫయర్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. మరి అరంగేట్ర సీజన్లోనే అదరగొట్టి అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించిన కొత్త జట్టు గుజరాత్‌ నేరుగా ఫైనల్లో చోటు సంపాదిస్తుందా.. లేక తొలి సీజన్లో ఛాంపియనయ్యాక మళ్లీ ఇంత కాలానికి చక్కటి ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ చేరిన పాత జట్టు రాజస్థాన్‌ తుది పోరు దిశగా తొలి అడుగు వేస్తుందా?

కోల్‌కతా

టీ20 లీగ్‌ ఫైనల్‌కు నేరుగా టికెట్‌ అందించే క్వాలిఫయర్‌ మంగళవారమే. ఈడెన్‌గార్డెన్స్‌లో కొత్త జట్టు గుజరాత్‌ను మాజీ ఛాంపియన్‌ రాజస్థాన్‌ ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 ద్వారా ఇంకో అవకాశం దక్కుతుంది. లీగ్‌ దశ ప్రదర్శన చూశాక సరైన జట్లే క్వాలిఫయర్‌ ఆడుతున్నాయని చెప్పాల్సిందే. లీగ్‌లోకి అడుగు పెట్టిన తొలి సీజన్లోనే అద్భుత ప్రదర్శనతో, నిలకడగా విజయాలు సాధిస్తూ అందరికంటే ముందు ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది గుజరాత్‌. ఇక రాజస్థాన్‌ విషయానికొస్తే.. ఘనంగా సీజన్‌ను ఆరంభించాక.. మధ్యలో కొంచెం తడబడ్డా, మళ్లీ పుంజుకుని విజయాలు సాధించింది.

అదే బలం..

లీగ్‌ దశలో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలవడానికి కారణం.. ఆ జట్టు ఆల్‌రౌండ్‌ బలమే. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌.. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా మెరుపులు మెరిపిస్తున్న సాహా.. ఫామ్‌ అందుకుని సమయోచితంగా రాణిస్తున్న హార్దిక్‌.. ఆఖరి ఓవర్లలో, ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపిస్తున్న మిల్లర్‌, తెవాతియా.. ఇలా ఆ జట్టు బ్యాటింగ్‌లో చాలా బలంగా ఉంది. ఇక బౌలింగ్‌లో షమి, రషీద్‌ ఖాన్‌ ప్రతి మ్యాచ్‌లో కీలక వికెట్లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశవాళీ బౌలర్‌ యశ్‌ దయాళ్‌, కివీస్‌ పేసర్‌ ఫెర్గూసన్‌ కూడా కొన్ని మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేశారు. లీగ్‌ దశ చివర్లో జట్టులోకి వచ్చిన సాయి కిశోర్‌ కూడా రాణిస్తుండటం కలిసొచ్చేదే. రషీద్‌ బ్యాటుతోనూ మెరుపులు మెరిపించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ జట్టు ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చడం ప్రత్యర్థికి కీలకం. బౌలింగ్‌లో షమి, రషీద్‌లను ఏమేర కాచుకుంటారన్నదీ ప్రధానమే.

వీళ్లను ఆపితేనే..

రాజస్థాన్‌ ప్రధాన బలం ఆ జట్టు విధ్వంసక బ్యాట్స్‌మెనే. బట్లర్‌, శాంసన్‌, హెట్‌మయర్‌ ఈ సీజన్లో ఎలా మెరుపులు మెరిపించారో అందరికీ తెలుసు. బట్లర్‌, శాంసన్‌ క్రీజులో కుదురుకున్నారంటే సిక్సర్ల మోత మోగాల్సిందే. హెట్‌మయర్‌ ఆఖరి ఓవర్లలో మెరుపులు మెరిపిస్తాడు. అయితే చివరి మూడు మ్యాచ్‌ల్లో బట్లర్‌ విఫలమయ్యాడు. రెండంకెల స్కోరు కూడా చేయలేదు. అయితే యశస్వి, పడిక్కల్‌ సమయోచితంగా రాణించి ఆ లోటును భర్తీ చేశారు. బట్లర్‌, శాంసన్‌లను ఆపలేకపోతే గుజరాత్‌ మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. వీరిపై ఎక్కువ ఆధారపడటం రాయల్స్‌కు ప్రతికూలతే. రషీద్‌ బౌలింగ్‌లో పేలవ రికార్డున్న బట్లర్‌.. ఈ మ్యాచ్‌లో అతణ్నెలా ఎదుర్కొంటాడో చూడాలి. బౌలింగ్‌లో చాహల్‌ ఆ జట్టుకు అతి పెద్ద బలం. బౌల్ట్‌ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అశ్విన్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు. బౌలింగ్‌లో గుజరాత్‌కు రాజస్థాన్‌ దీటుగానే కనిపిస్తోంది.


తుది జట్లు (అంచనా)

గుజరాత్‌: శుభ్‌మన్‌, సాహా, వేడ్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ (కెప్టెన్‌), మిల్లర్‌, తెవాతియా, రషీద్‌ ఖాన్‌, సాయికిశోర్‌, షమి, ఫెర్గూసన్‌, యశ్‌ దయాళ్‌.

రాజస్థాన్‌: బట్లర్‌, యశస్వి, శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), పడిక్కల్‌, హెట్‌మయర్‌, పరాగ్‌, అశ్విన్‌,   బౌల్ట్‌, మెకాయ్‌, చాహల్‌,   కుల్‌దీప్‌ సేన్‌.


79

సీజన్లో రాజస్థాన్‌ ఆటగాళ్లు బట్లర్‌ (37), శాంసన్‌ (21), హెట్‌మయర్‌ (21) కలిపి బాదిన సిక్సర్లు. 20కి పైగా సిక్సర్లు బాదిన ముగ్గురు ఆటగాళ్లున్న జట్టు రాజస్థాన్‌ మాత్రమే.


* ఈ సీజన్లో ఏడుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. ఆరుసార్లు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఓడిన ఒక్క మ్యాచ్‌లో కూడా విజయానికి చేరువగా వెళ్లింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. సామ్స్‌ (ముంబయి) అద్భుత బౌలింగ్‌తో ఓటమి తప్పలేదు.

* 16-20 ఓవర్ల గుజరాత్‌ రన్‌రేట్‌ 11.6. ఈ సీజన్లో ఆ జట్టుదే చివరి అయిదు ఓవర్లలో ఉత్తమ ప్రదర్శన. 16-20 మధ్య రాజస్థాన్‌ రన్‌రేట్‌ 8.3 మాత్రమే. ఆ జట్టుదే టోర్నీలో అత్యంత పేలవ ప్రదర్శన.

* లీగ్‌ దశలో గుజరాత్‌ పది విజయాలతో అగ్రస్థానంలో నిలవగా.. 9 మ్యాచ్‌ల్లో నెగ్గి రెండో స్థానం సాధించింది రాజస్థాన్‌.

* లీగ్‌ దశలో గుజరాత్‌, రాజస్థాన్‌ ఒక మ్యాచ్‌లో తలపడ్డాయి. అందులో గుజరాత్‌ 37 పరుగుల తేడాతో నెగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని