Updated : 25 May 2022 07:29 IST

Gujarat: మిల్లర్‌ దంచేయగా.. ఫైనల్‌కు దర్జాగా

టీ20 లీగ్‌ టైటిల్‌ పోరుకు గుజరాత్‌

క్వాలిఫయర్‌-1లో రాజస్థాన్‌ ఓటమి

కొత్త ఫ్రాంఛైజీ కుమ్మేసింది. గుజరాత్‌  అదరహో. టైటిల్‌కు అడుగు దూరంలో హార్దిక్‌ జట్టు. ఆడుతోన్నది తొలి టోర్నీనే అయినా.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన ఆ జట్టు టీ20 లీగ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తిరుగులేని ప్రదర్శనతో లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్‌.. క్వాలిఫయర్‌-1 లోనూ అదే జోరును కొనసాగించింది.

రాజస్థాన్‌ను ఓడిస్తూ ఆఖరి అంకానికి చేరుకుంది. లక్ష్యం చిన్నదేమీ కాకపోయినా.. మిల్లర్‌ సంచలన బ్యాటింగ్‌కు హార్దిక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ తోడైన వేళ పద్ధతిగా ఛేదించింది గుజరాత్‌. ఈ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్‌ చేరడానికి రాజస్థాన్‌కు మరో అవకాశముంది. బెంగళూరు, లఖ్‌నవూ మధ్య ఎలిమినేటర్‌ విజేతతో ఆ జట్టు ఢీకొంటుంది.

కోల్‌కతా

గుజరాత్‌ టీ20 లీగ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. మిల్లర్‌ (68 నాటౌట్‌; 38 బంతుల్లో 3×4, 5×6) అదరగొట్టడంతో మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. బట్లర్‌ (89; 56 బంతుల్లో 12×4, 2×6), సంజు శాంసన్‌ (47; 26 బంతుల్లో 5×4, 3×6) చెలరేగడంతో మొదట రాజస్థాన్‌ 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. బాధ్యతాయుతంగా ఆడిన మిల్లర్‌, హార్దిక్‌ పాండ్య (40 నాటౌట్‌; 27 బంతుల్లో 5×4) అభేద్యమైన నాలుగో   వికెట్‌కు 106 పరుగులు జోడించడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌.. 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఛేదన సాఫీగా..: రెండో బంతికే సాహా (0)ను ఔట్‌ చేయడం ద్వారా ఛేదనలో గుజరాత్‌కు బౌల్ట్‌ షాకిచ్చాడు. కానీ మరోవైపు వేడ్‌ (35; 30 బంతుల్లో 6×4) నిలవగా చెలరేగి ఆడిన శుభ్‌మన్‌ గిల్‌ (35).. ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. 7 ఓవర్లకు స్కోరు 68/1. కాసేపటి తర్వాత వేడ్‌ కూడా నిష్క్రమించినా.. మిల్లర్‌తో కలిసి హార్దిక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ధాటిగా ఆడిన హార్దిక్‌.. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. మరోవైపు మిల్లర్‌ ధాటిగా ఆడకపోయినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ మరీ ఎక్కువ కాకుండా చూశాడు హార్దిక్‌. అయితే తొలి 14 బంతుల్లో 11 పరుగులే చేసిన మిల్లర్‌ క్రమంగా బ్యాట్‌ ఝుళిపించాడు. అశ్విన్‌ బంతిని బౌండరీ దాటించిన అతడు.. చాహల్‌ ఓవర్లో సిక్స్‌ బాదాడు. 15 ఓవర్లలో గుజరాత్‌ స్కోరు 139/3. గెలవాలంటే చివరి 5 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ విపరీతంగా సిక్స్‌లు, ఫోర్లు కొట్టకున్నా పద్ధతిగా, ప్రశాంతంగా పని పూర్తి చేశారు మిల్లర్‌, హార్దిక్‌. సింగిల్స్‌ ఎక్కువగా తీశారు. అయితే ఆఖర్లో మిల్లరే బాదే బాధ్యత తీసుకున్నాడు. 17వ ఓవర్లో ఓ ఫోర్‌, 18వ ఓవర్లో సిక్స్‌ కొట్టాడు. చివరి 2 ఓవర్లలో 23 పరుగులు అవసరమున్నా మ్యాచ్‌ గుజరాత్‌ నియంత్రణలోనే ఉంది. కానీ 19వ ఓవర్లో మెకాయ్‌ ఏడు పరుగులే ఇవ్వడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. కానీ మిల్లర్‌ సంచలన బ్యాటింగ్‌తో గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో (ప్రసిద్ధ్‌) 16 పరుగులు చేయాల్సి రాగా తొలి మూడు బంతులను కళ్లు చెదిరే షాట్లతో సిక్స్‌లుగా మలిచి రాజస్థాన్‌కు షాకిచ్చాడు.

శాంసన్‌ ధనాధన్‌: రెండో ఓవర్లోనే దయాల్‌ బౌలింగ్‌లో యశస్వి ఔట్‌. మరో ఓపెనర్‌ బట్లర్‌ ధాటిగా ఆడలేకపోయాడు. ఆరు ఓవర్లు ముగిసే సరికి అతడు 15 బంతుల్లో 16 పరుగులే చేశాడు. కానీ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ అప్పటికి 55/1తో బలంగా నిలిచింది. అందుకు కారణం సంజు శాంసన్‌. తనదైన శైలిలో చెలరేగి అతడు కళ్లు చెదిరే షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 3 ఓవర్లలో రాజస్థాన్‌ 18 పరుగులే చేయగా.. శాంసన్‌ తొలి బంతి నుంచే దంచుడు మొదలు పెట్టాడు. ఎదుర్కొన్న మొదటి బంతినే (బౌలర్‌ యశ్‌ దయాల్‌) మణికట్టును, ముంజేతి బలాన్ని ఉపయోగిస్తూ లాంగాన్‌లో సిక్స్‌గా మలిచిన అతడు.. ఆ ఓవర్లోనే మరో ముచ్చటైన బౌండరీ సాధించాడు. ఏ బౌలర్‌నూ వదల్లేదు. షమి బౌలింగ్‌లో వరుసగా రెండు బంతుల్ని బౌండరీ దాటించిన అతడు.. జోసెఫ్‌ ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా, డీప్‌ ఫైన్‌ లెగ్‌లో సిక్స్‌లు దంచేశాడు. పవర్‌ ప్లే తర్వాత స్పిన్నర్‌ రషీద్‌ రంగంలోకి దిగడంతో పరుగుల వేగానికి కళ్లెం పడింది. తర్వాతి అయిదు ఓవర్లలో 28 పరుగులే చేసిన లఖ్‌నవూ శాంసన్‌ వికెట్‌ను కోల్పోయింది. ఊపుమీదున్న అతణ్ని పదో ఓవర్లో సాయికిశోర్‌ ఔట్‌ చేశాడు. బట్లర్‌ నిలిచినా.. జోరందుకోలేదు. 11 ఓవర్లలో రాయల్స్‌ స్కోరు 83/2 కాగా.. అప్పటికీ బట్లర్‌ సింగిల్స్‌తోనే నెట్టుకొస్తున్నాడు. 27 బంతుల్లో చేసింది 25 పరుగులే. కానీ అంతసేపు పట్టుదలతో నిలిచిన అతడు, ఆ శ్రమను వృథా కానివ్వలేదు. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్నీ వమ్ము చేయలేదు. రాజస్థాన్‌ మెరుగైన స్కోరు సాధించింది అంటే ప్రధాన కారణం బట్లరే. శాంసన్‌ మెరుపు ఆరంభాన్నిస్తే.. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన బట్లర్‌ అతడి శ్రమను సద్వినియోగం చేస్తూ, గుజరాత్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ కళ్లు చెదిరే ముగింపునిచ్చాడు. మొదటి నుంచి ఎంత ప్రశాంతంగా సాగాడో చివర్లో అంత ఉగ్రరూపం దాల్చాడు అతడు. బట్లర్‌ విధ్వంసం చాలా ఆలస్యంగా 17వ ఓవర్లో మొదలైంది. కానీ అదిరిపోయేలా సాగింది. యశ్‌ దయాల్‌ వేసిన ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన అతడు.. జోసెఫ్‌ బౌలింగ్‌లో మరో మూడు బంతులను బౌండరీ దాటించాడు. చివరి రెండు ఓవర్లలో మరో రెండు సిక్స్‌లు, ఫోర్‌ దంచేశాడు. ఆఖరి నాలుగు ఓవర్లలో రాజస్థాన్‌ ఏకంగా 64 పరుగులు రాబట్టింది. హెట్‌మయర్‌  (7 బంతుల్లో 4)తో 45 పరుగుల భాగస్వామ్యంలో బట్లర్‌ చేసినవే 40 పరుగులు. బట్లర్‌ చివరి ఓవర్‌ చివర్లో రనౌటయ్యాడు. పడిక్కల్‌ (28; 20 బంతుల్లో 2×4, 2×6) కూడా విలువైన పరుగులే చేశాడు. శాంసన్‌ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన అతడు ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. బట్లర్‌తో మూడో వికెట్‌కు 37 పరుగులు జోడించి ఔటయ్యాడు.

 

Read latest T20 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని