Hardik Pandya: దంచేసిన హార్దిక్‌.. విజృంభించిన ఫెర్గూసన్‌

కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనను కొనసాగిస్తోంది. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో రాజస్థాన్‌ను మట్టికరిపించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య

Updated : 15 Apr 2022 06:49 IST

రాజస్థాన్‌పై గుజరాత్‌ విజయం 

కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనను కొనసాగిస్తోంది. అయిదు మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో రాజస్థాన్‌ను మట్టికరిపించింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అదిరే బ్యాటింగ్‌తో గుజరాత్‌ను ముందుండి నడిపించాడు. హార్దిక్‌తో పాటు మిల్లర్, మనోహర్‌ రాణించడంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన గుజరాత్‌.. ఫెర్గూసన్‌ సూపర్‌ బౌలింగ్‌తో రాజస్థాన్‌కు కళ్లెం వేసింది.

నవీ ముంబయి: గుజరాత్‌ సత్తా చాటింది. గురువారం 37 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. హార్దిక్‌ పాండ్య (87 నాటౌట్‌; 52 బంతుల్లో 8×4, 4×6) చెలరేగడంతో మొదట గుజరాత్‌ 4 వికెట్లకు 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభినవ్‌ మనోహర్‌ (43; 28 బంతుల్లో 4×4, 2×6), మిల్లర్‌ (31 నాటౌట్‌; 14 బంతుల్లో 5×4, 1×6) కూడా బ్యాట్‌ ఝుళిపించారు. ఛేదనలో రాజస్థాన్‌ తడబడింది. ఫెర్గూసన్‌ (3/23), యశ్‌ దయాల్‌ (3/40) విజృంభించడంతో 9 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. బట్లర్‌ (54; 24 బంతుల్లో 8×4, 3×6) టాప్‌ స్కోరర్‌.

తడబడిన రాజస్థాన్‌: ఛేదనలో మంచి ఆరంభాన్ని రాజస్థాన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. పడిక్కల్‌ (0) రెండో ఓవర్లోనే ఔటైనా.. బట్లర్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో 5 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 56/1తో బలమైన స్థితిలో నిలిచింది. షమి వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన బట్లర్‌.. రెండో ఓవర్లో (యష్‌) రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ దంచాడు. యష్‌ తర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయి మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదేశాడు. కానీ ఆరో ఓవర్‌తో మ్యాచ్‌ గమనమే మారిపోయింది. ఫెర్గూసన్‌ రెండు వికెట్లతో రాజస్థాన్‌ను దెబ్బతీశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన అశ్విన్‌.. మిల్లర్‌ అందుకున్న కళ్లు చెదిరే క్యాచ్‌కు నిష్క్రమించగా.. బట్లర్‌ను ఫెర్గూసన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్‌ (11), వాండెర్‌ డసెన్‌ (6) కూడా ఎక్కువసేపు నిలువలేదు. దీంతో రాజస్థాన్‌ 11వ ఓవర్లో 90/5తో ఓటమి కోరల్లో చిక్కుకుంది. కానీ హెట్‌మయర్‌ (29; 17 బంతుల్లో 2×4, 1×6) దూకుడుగా ఆడుతుండడంతో రాజస్థాన్‌లో ఆశలు మిగిలే ఉన్నాయి. కానీ షమి అతణ్ని ఔట్‌ చేశాడు. పరాగ్‌ (18; 16 బంతుల్లో 1×4, 1×6), నీషమ్‌ (17; 15 బంతుల్లో 1×4) నిలిచినా.. వాళ్లలో జట్టును గెలిపించడానికి అవసరమైన దూకుడు లోపించింది. సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగింది. 16వ ఓవర్లో పరాగ్‌ను ఫెర్గూసన్‌ ఔట్‌ చేయగా. చివరి నాలుగు ఓవర్లో రాజస్థాన్‌ 55 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు నీషమ్‌ ఒక్కడే ఆ జట్టుకు ఉన్న కాస్త ఆశ. కానీ 18వ ఓవర్లో హార్దిక్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అతణ్ని ఔట్‌ చేయడంతో రాజస్థాన్‌ ఓటమి ఖాయమైపోయింది.

హార్దిక్‌ ధనాధన్‌: గుజరాత్‌ గట్టి లక్షాన్ని నిర్దేశించింది అంటే కారణం హార్దిక్‌ పాండ్యనే. చక్కని బ్యాటింగ్‌తో అతడు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అభినవ్‌ మనోహర్, మిల్లర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. నిజానికి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఆరంభంలో చిక్కుల్లో పడింది. 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో డసెన్‌ డైరెక్ట్‌ త్రోకు ఓపెనర్‌ వేడ్‌ (12) రనౌట్‌ కాగా.. విజయ్‌ శంకర్‌ (2)ను కుల్‌దీప్‌ సేన్‌ ఔట్‌ చేశాడు. దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి శంకర్‌.. వికెట్‌కీపర్‌ శాంసన్‌కు చిక్కాడు. 4 ఓవర్లకు స్కోరు 20 పరుగులే. కానీ హార్దిక్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు దంచిన అతడు... అశ్విన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్స్‌ కొట్టాడు. పరాగ్‌ బౌలింగ్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (13) కూడా ఓ ఫోర్‌ కొట్టాడు కానీ.. భారీ షాట్‌ ఆడబోయి లాంగాన్‌లో హెట్‌మయర్‌కు చిక్కాడు. ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. 11 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78/3. హార్దిక్, మనోహర్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 13వ ఓవర్‌ నుంచి బ్యాట్స్‌మెన్‌ జోరు పెరిగింది. చాహల్‌ వేసిన ఆ ఓవర్లో మనోహర్‌ వరుసగా 4, 6  కొట్టగా.. సేన్‌ ఓవర్లో హార్దిక్‌ రెండు ఫోర్లు దంచాడు. మనోహర్‌ కూడా ఓ బంతిని బౌండరీ దాటించడంతో ఆ ఓవర్లో 14 పరుగులొచ్చాయి. జోరు కొనసాగించిన హార్దిక్‌.. అశ్విన్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు దంచాడు. తర్వాతి ఓవర్లోనే మనోహర్‌ను చాహల్‌ ఔట్‌ చేసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసినా రాజస్థాన్‌కు ఉపశమనం దక్కలేదు. హార్దిక్, మిల్లర్‌ రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ జంట దూకుడుకు గుజరాత్‌ చివరి నాలుగు ఓవర్లలో 53 పరుగులు రాబట్టింది. మిల్లర్‌ మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ దంచడంతో ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో కుల్‌దీప్‌ సేన్‌ ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్, మిల్లర్‌ జోడీ అభేద్యమైన అయిదో వికెట్‌కు కేవలం 25 బంతుల్లో 53 పరుగులు జోడించింది. కుల్‌దీప్‌ సేన్‌ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చాడు. రాజస్థాన్‌ ప్రధాన పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ చిన్న గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అతడి స్థానంలో జిమ్మీ నీషన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

హార్దిక్‌కు ఏమైంది 
బ్యాటుతో అదరగొట్టిన హార్దిక్‌ పాండ్య గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత మెరుపు ఫీల్డింగ్‌తో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ను రనౌట్‌ చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గాయం భయం అతణ్ని వెంటాడుతోంది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ను హార్దిక్‌ పూర్తి చేయలేకపోయాడు. తొడకండరాల సమస్యతో మూడు బంతులే వేసి మైదానాన్ని వీడాడు. ఆ ఓవర్‌ను విజయ్‌ శంకర్‌ పూర్తి చేశాడు. హార్దిక్‌ చాలా కాలం గాయాలతో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు