Gujarat vs Rajasthan: నువ్వా.. నేనా..? ఫైనల్‌కు ఎవరు ..?

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ 70 లీగ్‌ మ్యచ్‌లు పూర్తిచేసుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ మంగళవారం తొలి క్వాలిఫయర్‌ ఆడనుండగా...

Updated : 23 May 2022 11:59 IST

రేపే క్వాలిఫయర్‌ -1.. రసవత్తర పోరు

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ 70 లీగ్‌ మ్యచ్‌లు పూర్తిచేసుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌ మంగళవారం తొలి క్వాలిఫయర్‌ ఆడనుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లఖ్‌నవూ, బెంగళూరు బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఎవరు ముందడుగు వేస్తారనేది ఆసక్తిగా మారింది. తొలి రెండు జట్ల బలాబలాలు.. లీగ్‌ దశలో ఎవరు పైచేయి సాధించారో తెలుసుకుందాం..

ఈసారి కొత్తగా వచ్చిన గుజరాత్‌ జట్టు ఆది నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్‌ స్థానంలో దూసుకెళ్లింది. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో మొత్తం 14 లీగ్‌ మ్యాచుల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌లో మెరుగైన చోటు కోసం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌వరకూ పోరాడింది. సంజూ టీమ్‌.. లఖ్‌నవూ లాగే తొమ్మిది విజయాలతో నిలవగా.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ కారణంగా రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు గుజరాత్‌తో తొలి క్వాలిఫయర్‌లో పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం దొరుకుతుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది.

కొత్త జట్టు.. నూతన సారథ్యం

హేమాహేమీలు సారథులుగా ఉన్న ఈ భారత టీ20 లీగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనుభవం లేకుండా నాయకత్వ బాధ్యతలు చేపట్టి జట్టును నడపించడం అంత తేలికైన విషయం కాదు. అయితే జట్టు సభ్యుల మద్దతుంటే పెద్ద కష్టమేం కాదని నిరూపించాడు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య. గతేడాది వరకు ముంబయి తరఫున ఆడిన అతడిని మెగా వేలానికి ముందే గుజరాత్‌ కొనుగోలు చేసింది. ఏకంగా కెప్టెన్సీ కట్టబెట్టడం విశేషం. అయితే, గుజరాత్‌ లీగ్‌ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్‌లో గెలవడం గమనార్హం. ఈ జట్టు సమష్టిగా రాణించడమే అందుకు కారణం. టాప్‌ఆర్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది. ఆ జట్టులో టాప్‌ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ పాండ్య 413 పరుగులతో 11వ స్థానంలో నిలిచాడు. 403 రన్స్‌తో శుభ్‌మన్‌ గిల్ 13వ స్థానంలో నిలిచాడు.

గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్‌ హిట్టర్లు.. స్ట్రోక్‌ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. అయితే షమీ, దయాల్, అల్జారీ జోసెఫ్, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌తో బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉండటం గుజరాత్‌కు బాగా కలిసొస్తున్న మరో విషయం. సాయికిశోర్‌ కూడా అవకాశం వచ్చినప్పుడు ఫర్వాలేదనిపించాడు. ఇక ఓడిపోయిన నాలుగు మ్యాచుల్లో మూడుసార్లు గుజరాత్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అంటే లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొరపాటున నాకౌట్‌ దశలో ఇలాగే తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఫలితంలో తేడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక బౌలింగ్‌ పరంగా అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-10 బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (18) ఆరు, షమీ (18) ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకున్నారు.

ఈసారైనా కప్‌ దిశగా..

మరోవైపు రాజస్థాన్‌ టీమ్‌.. దివంగత దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ నేతృత్వంలో తొలి సీజన్‌లోనే టైటిల్‌ను ముద్దాడి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. కేవలం మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకుని అక్కడితో సరిపెట్టుకుంది. అది కూడా మూడు, నాలుగు స్థానాలతోనే. అయితే, ఈసారి పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కించుకున్న రాజస్థాన్‌ తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆ జట్టు అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ, అదంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎదుర్కొనేది టాప్‌ టీమ్ గుజరాత్‌తో. దీంతో ఈ జట్టుపై విజయం సాధించాలంటే రాజస్థాన్‌ తమ అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించాల్సిందే. యాజమాన్యం అనుకున్న ప్రణాళికలను ఆటగాళ్లు మైదానంలో కచ్చితంగా అమలు చేస్తే  ఈ జట్టు రెండోసారి ఫైనల్‌ చేరే అవకాశాలు ఉన్నాయి.

రాజస్థాన్‌కు ఓపెనర్‌ జోస్ బట్లరే కీలకం. అతడు ఇప్పటికే అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. 14 మ్యాచుల్లో మూడు శతకాలు, మూడు అర్ధశతకాలతో 629 పరుగులు చేశాడు. కానీ, గత ఐదు మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే కేవలం 63 పరుగులే చేశాడు. అంటే తొలి 9 మ్యాచుల్లో 566 రన్స్‌ చేసిన బట్లర్ ఆ తర్వాత పూర్తిగా గాడితప్పాడు. ఈ నేపథ్యంలో కీలకమైన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో అతడు విజృంభించాల్సిన అవసరం ఉంది. ఇక యువ ఆటగాళ్లలో యశస్వి జైశ్వాల్‌, పడిక్కల్, రియాన్ పరాగ్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌ సైతం బ్యాటింగ్‌ పరంగా రాజస్థాన్‌కు అదనపు బలం చేకూరుస్తున్నాడు. ఇక అతడి బౌలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఫర్వాలేదనిపిస్తున్నా కొంచెం దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్‌ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ (26) సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.

లీగ్‌ స్టేజ్‌లో గుజరాతే గెలిచింది..

ఈ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య ఒకే ఒక్క మ్యాచ్‌ జరిగింది. అది గుజరాతే గెలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (87 నాటౌట్‌; 52 బంతుల్లో 8x4, 4x6) రెచ్చిపోయాడు.

-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని