Sanju Samson: మా చేతిలో వికెట్లు ఉంటే ఈ మ్యాచ్‌ గెలిచేవాళ్లం: సంజూ

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ చేతిలో వికెట్లు ఉంటే గెలిచేవాళ్లమని రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 37 పరుగులతో విజయం సాధించింది...

Published : 15 Apr 2022 09:31 IST

(Photo: Sanju Samson Instagram)

ముంబయి: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ చేతిలో వికెట్లు ఉంటే గెలిచేవాళ్లమని రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 37 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టు నాలుగు విజయాలతో టాప్‌లో దూసుకుపోతోంది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 192/4 భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (87 నాటౌట్; 52 బంతుల్లో 8x4, 4x6) దంచికొట్టాడు. ఛేదనలో రాజస్థాన్‌ 155/9కే పరిమితమై ఓటమిపాలైంది. పాండ్య బౌలింగ్‌లోనూ ఒక వికెట్‌ తీయడంతో పాటు తన మెరుపు ఫీల్డింగ్‌తో సంజూ (11)ను రనౌట్‌ చేశాడు. దీంతో అతడు ఆల్‌రౌండ్‌ షో చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన సంజూ ఇలా చెప్పుకొచ్చాడు.

‘గుజరాత్‌ అంత స్కోర్‌ చేసిందంటే ఆ క్రెడిట్‌ అంతా ఆ జట్టు బ్యాటర్లకు దక్కుతుంది. ముఖ్యంగా హార్దిక్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. మా చేతిలో వికెట్లు ఉంటే ఈ స్కోర్‌ ఛేదించేవాళ్లమనే అనుకున్నా. పవర్‌ప్లేలో మా రన్‌రేట్ కూడా అద్భుతంగా ఉంది. అయితే వికెట్లు కోల్పోయాం. ఈరోజు హార్దిక్‌ అన్ని విభాగాల్లో రాణించాడు. ఈ లీగ్‌లో ప్రతి గేమ్‌ ముఖ్యమైందే అని నాకు తెలుసు. ఇక తర్వాతి మ్యాచ్‌లో తిరిగి బలంగా పుంజుకోవాలి. గతేడాది వరకు నేను మూడో స్థానంలో ఆడుతున్నా. ఇప్పుడు జట్టు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయాలనుకున్నాం. అశ్విన్‌ లాంటి ఆటగాడు ఉంటే ఇలాంటి ప్రయోగాలు చేయడం తేలికవుతుంది. ఇదంతా మేం ఆడే కాంబినేషన్‌ను బట్టి ఉంటుంది’ అని సంజూ వివరించాడు.

(Photo: Hardik Pandya Instagram)

ఇక గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఇలా విజయాలు సాధిస్తుంటే బాగుంటుందని చెప్పాడు. ఇక రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో బౌలింగ్‌ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మధ్యలోనే మైదానం వీడినట్లు తెలిపాడు. ఈరోజు తాను లయ అందుకున్నానని, దాంతో పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేశానన్నాడు. తాను అలా విజృంభించడం ద్వారా ఇతర ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. సారథిగా ముందుండి నడపడం గొప్ప విశేషమని అన్నాడు. తమ జట్టు ప్రస్తుతం బాగా ఆడుతోందని, ఇలాగే వరుస విజయాలతో ముందుకు సాగాలనుకుంటున్నట్లు చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని