Kohli : ‘‘కోహ్లీ ఆ చీకటి ప్రదేశంలో ఉన్నాడు..’’

బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరైన ఫామ్‌ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ టీ20 సీజన్‌లో తన

Published : 25 Apr 2022 02:17 IST

వరుసగా రెండోసారి విరాట్‌ గోల్డెన్‌ డక్‌పై పీటర్సన్‌

ముంబయి : బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరైన ఫామ్‌ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ టీ20 సీజన్‌లో తన పేలవ ప్రదర్శనతో అటు అభిమానులను.. ఇటు జట్టు యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన తీరు అతడి ఆటతీరుకు నిదర్శనం. ఈ సీజన్‌లో ఇలా వెనుదిరగడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. దీంతో విరాట్‌ బ్యాటింగ్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ కోహ్లీ ఫామ్‌పై స్పందించాడు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడంటూ వ్యాఖ్యానించాడు. ‘‘ప్రస్తుతం కోహ్లీ ఏ స్థితిలో ఉన్నాడో.. గతంలో నా కెరీర్‌లో రెండుసార్లు నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇది మంచిది కాదు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడు. ముఖ్యంగా.. అందరి దృష్టి అతడిపైనే ఉన్నప్పుడు.. అది పూర్తిగా ఒంటరి ప్రదేశం. ఇది త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆట కోసం అతడు పరుగులు సాధించాల్సి ఉంది’’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.

ఇక భారత మాజీ సారథి సునిల్ గావస్కర్‌ కూడా కోహ్లీ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా కొన్ని బంతులు కూడా ఎదుర్కోకుండా ఔట్‌ అయితే వారి బ్యాటింగ్‌ గురించి చెప్పడం కష్టం. కనీసం డజన్‌ బంతులైనా ఆడితే.. ఫుట్‌వర్క్‌ ఎలా ఉంది.. లైన్‌లోనే ఆడుతున్నాడా.. ఈ సాంకేతికతో ఆడితే బాగుంటుంది.. అని చెప్పొచ్చు’ అని గావస్కర్‌ వివరించాడు.

నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జన్‌సన్‌ బౌలింగ్‌లో సెకండ్‌ స్లిప్‌లో చిక్కి కోహ్లీ వెనుదిరిగాడు. అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇలాగే పరుగులేమీ చేయకుండా ఔటైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాదే టీ20 వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో విరాట్‌ ఆటతీరుపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని