T20 League: వీళ్లంతా సింగిల్‌ మ్యాచ్‌ హీరోలు : క్లిక్కయ్యారు.. గెలిపించారు

భారత టీ20 లీగ్‌.. అటు క్రికెటర్లకు, ఇటు ప్రేక్షకులకు కనులపండుగ. వేసవి మొత్తం వినోదాన్ని పంచుతూ అసలుసిసలైన క్రికెట్‌ మజాను అందిస్తుంది...

Updated : 27 May 2022 10:47 IST

భారత టీ20 లీగ్‌.. అటు క్రికెటర్లకు, ఇటు ప్రేక్షకులకు వేసవి వినోదాన్ని పంచుతూ అసలు సిసలైన క్రికెట్‌ మజాను అందిస్తోంది. ఈ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తళుక్కున మెరిశారు. సంచలన బ్యాటింగ్‌తో తమ జట్లను విజయతీరాలకు చేర్చారు. అలా ఈ సీజన్‌లో సింగిల్‌ మ్యాచ్‌ హీరోలుగా నిలిచిన ఆటగాళ్లెవరంటే..


రజత్‌ పటీదార్‌: బెంగళూరు యువ సంచలనం రజత్‌ పటీదార్‌ తాజాగా లఖ్‌నవూతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అతడు ఒక్క ఇన్నింగ్స్‌తోనే హీరో అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 207/4 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన రజత్‌ (112; 54 బంతుల్లో 12x4, 7x6) దంచికొట్టాడు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో దినేశ్‌ కార్తీక్‌ (37; 23 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి 84 పరుగులు జోడించాడు. దీంతో ఆ ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం లఖ్‌నవూ ఛేదనలో 193/6 పరుగులకు పరిమితమై 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


ప్యాట్‌ కమిన్స్‌: ఈ సీజన్‌లో మొదటి సంచలన బ్యాటింగ్‌ చేసింది కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌. ముంబయితో జరిగిన 14వ మ్యాచ్‌లో కమిన్స్‌ 14 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన కేఎల్‌ రాహుల్‌ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి తొలుత బ్యాటింగ్‌ చేసి 161/4 పరుగులు చేయగా.. కోల్‌కతా 16 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఓవర్లకు 127/5తో లక్ష్యం దిశగా సాగుతున్న ఆ జట్టు 16వ ఓవర్‌ పూర్తయ్యేసరికి మ్యాచ్‌ గెలిచింది. డానియల్‌ సామ్స్‌ వేసిన ఆ ఓవర్‌లో కమిన్స్‌ (56 నాటౌట్‌;15 బంతుల్లో 4X4, 6X6) వరుసగా 6, 4, 6, 6, నోబాల్‌ 2, 4, 6 రెచ్చిపోవడంతో కోల్‌కతా తేలిగ్గా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.


ఉతప్ప, దూబే: చెన్నై ఆటగాళ్లు రాబిన్‌ ఉతప్ప, శివమ్‌ దూబే కూడా ఓకే ఒక్క ఇన్నింగ్స్‌లో దంచికొట్టి అభిమానులను అలరించారు. బెంగళూరుతో జరిగిన 22వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 216/4 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఉతప్ప (88; 50 బంతుల్లో 4x4, 9x6), దూబే (95 నాటౌట్‌; 46 బంతుల్లో 5x4, 8x6) మూడో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. ఇక ఛేదనకు దిగిన బెంగళూరు మ్యాచ్‌ గెలిచేందుకు విశ్వ ప్రయత్నం చేసినా చివరికి 193/9 స్కోర్‌తో నిలిచింది. దీంతో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ గేమ్‌ తర్వాత ఉతప్ప, దూబే మరో మ్యాచ్‌లో ఈ స్థాయిలో చెలరేగలేదు.


ధోనీ: ధోనీ ఈ సీజన్‌లో కోల్‌తాతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో మెరిసి అభిమానులను మెప్పించాడు. అయితే, ముంబయితో తలపడిన 33వ మ్యాచ్‌లో ధోనీ (28 నాటౌట్‌; 13 బంతుల్లో 3x4, 1x6) రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 155/7 పరుగుల స్కోర్‌ చేయగా.. ఛేదనలో చెన్నై 19 ఓవర్లకు 139/6తో నిలిచింది. చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 17 పరుగులు అవసరం కాగా పరిస్థితులు కష్టంగా మారాయి. జయదేవ్‌ ఉనద్కత్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే ప్రిటోరియస్‌ (22; 14 బంతుల్లో 2x4, 1x6) ఔటవ్వడంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది. బ్రావో రెండో బంతికి సింగిల్‌ తీసివ్వగా.. తర్వాత ధోనీ వరుసగా 6, 4, 2, 4 దంచికొట్టి చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో 40 ఏళ్ల వయస్సులోనూ తాను మేటి ఫినిషర్‌నని నిరూపించుకున్నాడు.


రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌: గుజరాత్ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడిందంటే కారణం జట్టు సమష్టిగా రాణించడమే. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. ముఖ్యంగా రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌ పలు సందర్భాల్లో ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించారు. ఇక హైదరాబాద్‌తో తలపడిన 40వ మ్యాచ్‌లో వీరిద్దరూ ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 195/6 పరుగుల భారీ స్కోర్‌ సాధించగా.. గుజరాత్‌ ఛేదనలో 17 ఓవర్లకు 149/5తో నిలిచి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే, రాహుల్‌ తెవాతియా (40 నాటౌట్‌; 21 బంతుల్లో 4x4, 2x6), రషీద్‌ ఖాన్‌ (31; 11 బంతుల్లో 4x6) సంచలన బ్యాటింగ్‌ చేశారు. చివరి ఓవర్‌లో 22 పరుగులు అవసరమైన వేళ తెవాతియా ఒక సిక్సర్‌, సింగిల్‌ తీసివ్వగా.. తర్వాత రషీద్‌ ఖాన్‌ 3 సిక్సర్లు బాది గుజరాత్‌ జట్టుతో పాటు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.


రుతురాజ్‌: గతేడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈసారి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. అయితే, హైదరాబాద్‌తో తలపడిన 46వ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసి 202/2 భారీ స్కోర్‌ చేసింది. రుతురాజ్‌ (99; 57 బంతుల్లో 6x4, 6x6), డెవాన్‌ కాన్వే (85; 55 బంతుల్లో 8x4, 4x6) తొలివికెట్‌కు 182 పరుగులు జోడించారు. కానీ, రుతురాజ్‌ శతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. తర్వాత హైదరాబాద్‌ 189/6తో నిలిచి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


రోమన్‌ పావెల్‌: దిల్లీ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రోమన్‌ పావెల్‌ కూడా ఈ సీజన్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో మెరిశాడు. హైదరాబాద్‌తో ఆడిన 50వ మ్యాచ్‌లో అతడు పెను విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి 207/3 పరుగులు చేసింది. ఓపెనర్‌ వార్నర్‌ (92 నాటౌట్‌; 58 బంతుల్లో 12x4, 3x6)తో కలిసి పావెల్‌ (67; 35 బంతుల్లో 3x4, 6x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 122 పరుగులు జోడించారు. చివరికి హైదరాబాద్‌ ఛేదనలో 186/8తో నిలిచి 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


విరాట్‌ కోహ్లీ: ఈ సీజన్‌లో బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఫామ్‌లో లేక తంటాలు పడుతున్నాడు. అయితే, లీగ్‌ స్టేజ్‌లో గుజరాత్‌తో తలపడిన 67వ మ్యాచ్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 168/5 స్కోర్‌ సాధించగా బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ విరాట్‌ (73; 54 బంతుల్లో 8x4, 2x6) తనలోని మునుపటి ఆటగాడిని గుర్తుచేస్తూ ఇన్నింగ్స్‌ నడిపించాడు. చూడచక్కని షాట్లతో అభిమానులను అలరించాడు. దీంతో కోహ్లీ ఈ సీజన్‌లో తొలిసారి తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని