KL Rahul: నేనా బంతిని చూడలేదు.. లేకపోతే ఏదో ఒకటి చేసేవాడిని: కేఎల్ రాహుల్‌

గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఔటైన బంతిని గమనించలేదని లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఆ బంతిని చూసి ఉంటే కచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడినని చెప్పాడు...

Published : 11 Apr 2022 11:47 IST

స్టాయినిస్‌ ఎంత ప్రమాదకారో తెలుసు.. అందుకే అలా

(Photo: KL Rahul Instagram)

ముంబయి: గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఔటైన బంతిని గమనించలేదని లఖ్‌నవూ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఆ బంతిని చూసి ఉంటే కచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడినని చెప్పాడు. రాజస్థాన్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన రాహుల్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన మెరుపు వేగం బంతికి అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఇక మరుసటి బంతికే వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ కృష్ణప్ప గౌతమ్‌ (0) సైతం ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో లఖ్‌నవూ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రాహుల్‌ బౌల్ట్‌ బౌలింగ్‌ను కొనియాడాడు.

‘నేను ఆ బంతిని చూడలేదు. చూస్తే ఏదో ఒకటి చేసేవాడిని. ఆ క్రెడిట్‌ అంతా బౌల్ట్‌కే దక్కుతుంది. అదొక అత్యుత్తమ డెలివరీ. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా మాది బలమైన జట్టే. బ్యాట్‌, బంతితో రాణించే సత్తా మాకుంది. 20 పరుగులలోపే మూడు వికెట్లు కోల్పోయినా మేం గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. కానీ, మా జట్టులో ఒక మేటి భాగస్వామ్యం నిర్మించలేకపోయాం. చివర్లో స్టాయినిస్‌ మ్యాచ్‌ గెలిపించినంత పనిచేశాడు. అతడి ఆట మెచ్చుకోదగినది. ఈ సీజన్‌లో అతడికి ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో ఈ ప్రదర్శనతో మంచి ఆత్మవిశ్వాసం సంపాదించుకుంటాడు. అతడిని చివరిదాకా బ్యాటింగ్‌కు పంపకపోవడం కూడా మా ప్రణాళికలో భాగమే. చివర్లో అతడు ఎంత ప్రమాదకారో మాకు తెలుసు. అందుకే అలా పంపించాం. మా వ్యూహాలతో ప్రత్యర్థులకు అర్థంకాని విధంగా ఆడాలనుకుంటాం. కానీ, ఈ మ్యాచ్‌లో మేం వేసుకున్న ప్రణాళికలను అమలుచేయలేకపోయాం. ఈ ఓటమి ఓ గుణపాఠంలాంటిది’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, ఛేదనలో బౌల్ట్‌ 2/30, యుజ్వేంద్ర చాహల్‌ 4/41 రెచ్చిపోవడంతో లఖ్‌నవూ విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆఖర్లో స్టాయినిస్‌ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 2x4, 4x6), దుష్మంత చమీరా (13; 7బంతుల్లో 2x4), అవేశ్‌ ఖాన్‌ (7 నాటౌట్‌; 2 బంతుల్లో 1x6) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో లఖ్‌నవూ ఈ సీజన్‌లో రెండో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో టాప్‌లో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని